Harish rao about Eyes Flu: కళ్ల కలక ఇన్ఫెక్షన్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అసరం లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వానాకాలంలో వైరల్ ఫీవర్‌లతో పాటుగా సోకే ఈ తరహా ఇన్‌ఫెక్షన్ల వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఏమి సంభవించబోవని వైద్యనిపుణులు చెబుతున్నట్లు తెలిపారు. కళ్లు ఎర్రబడటం, కంటి నుంచి నీరు కారడం, వాపు రావడం వంటివి కళ్ల కలక ముఖ్య లక్షణాలుగా గుర్తించారని, దీని పట్ల అప్రమత్తంగా ఉంటే సరిపోతుందన్నారు. కళ్ల కలక, ఇతర సీజనల్ వ్యాధుల పట్ల తెలంగాణ వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తతో ఉందన్నారు. పలు జిల్లాల్లో కళ్ల కలక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని విభాగాల ఉన్నతాధికారులు, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు సహా అన్ని జిల్లాల వైద్యాధికారులతో మంత్రి హరీశ్ రావు వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, కళ్ల కలక పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి నివారణ చర్యలు, చికిత్స తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆశా, ఏఎన్ఎంలు లక్షణాల ఆధారంగా ఇన్ఫెక్షన్ సోకిన వారిని గుర్తించి, సమీప ఆసుపత్రల ద్వారా చికిత్స అందేలా చూడాలన్నారు. గురుకులాలు, విద్యార్థుల హాస్టల్లలో పరిశుభ్రత గురించి అవగాహన పెంచాలన్నారు. ఇన్‌ఫెక్షన్ సోకిన వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తరుచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇన్‌ఫెక్షన్ సోకిన వారు వాడిన టవల్స్, బెడ్‌షీట్స్, కర్చీఫ్, పిల్లో వంటివి వినియోగించకపోవడం వల్ల వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చన్నారు.


చికిత్సలో వినియోగించే కంటి చుక్కలు, ఆయింట్మెంట్లు, అవసరమైన మందులను పీహెచ్సీ, బస్తీ దవాఖాన, పల్లె దవాఖానల స్థాయి నుంచి అన్నిఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని, లక్షణాలు ఉన్న వారు ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందాలని సూచించారు. మరింత ఎక్కువ మందికి వైద్య సేవలు అందించేలా, సరోజని దేవి కంటి ఆసుపత్రి ఓపీ వేళలు పెంచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను మంత్రి ఆదేశించారు. 


వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆసుపత్రుల్లో పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండ్లదే అని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెకానిజం తప్పకుండా పాటించాలన్నారు. ఆసుపత్రిల వారీగా ఏర్పాటు చేసుకున్న ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ప్రతి సోమవారం సమావేశమై, చర్చించుకోవాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ నిబంధనలు పాటించేలా జిల్లా వైద్యాధికారులు చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు కొనసాగించాలన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన ఎయిర్ ఫిల్టర్లు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. 


మహిళ సమగ్ర ఆరోగ్యం కోసం మంగళవారం నాడు నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ క్లినిక్స్ పనితీరును డీఎంహెచ్వో, ప్రోగ్రాం ఆఫీసర్లు మానిటరింగ్ చేయాలన్నారు. ఆరోగ్య మహిళ క్లినిక్స్ ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి, మహిళలకు అవగాహన కల్పించి, వైద్య సేవలు పొందేలా చూడాలన్నారు. 


ఇది కూడా చదవండి : Eye Infections Solution: వర్షా కాలంలో కంట్లో ఇన్‌ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే..


ఏఎన్ఎం పరీక్ష తెలుగులోనూ నిర్వహణ...
ఎంపీహెచ్ఏ ఫిమేల్ (ఏఎన్ఎం) పరీక్ష నిర్వహణ విషయంలో ఏఎన్ఎంల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలని, వారి కోరిక మేరకు పరీక్షను ఇంగ్లీష్ భాషతో పాటు, తెలుగులో కూడా నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించాలని, అవసరమైన స్టడీ మెటిరీయల్ అందజేయాలని ఆదేశించారు. దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారికి తగిన వెయిటేజ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని హెల్త్ సెక్రెటరీని ఆదేశించారు. బుధవారం తెలంగాణ స్టేట్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నిర్వహించే 5204 స్టాఫ్ నర్సు ఆన్లైన్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని, మహిళా అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వైద్యారోగ్య విభాగాల అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించి, పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు.


కండ్ల కలకపై అవగాహన కోసం డాక్టర్ ఏమంటున్నారో చూడండి : Eye Flu Symptoms, Conjunctivitis Symptoms: కండ్ల కలక లక్షణాలు ఏంటంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి