ఆర్టీసీకి, ప్రభుత్వానికి హై కోర్టు సూటి ప్రశ్నలు
ఆర్టీసీకి, ప్రభుత్వానికి హై కోర్టు సూటి ప్రశ్నలు
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా సోమవారం ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి పలు సూటి ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. హై కోర్టు ప్రశ్న ప్రజల కోసమే పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వాలు ఆర్టీసీ కార్మికులను కూడా ప్రజలుగానే గుర్తించాలి కదా అని ఆర్టీసీ సమ్మెపై పిటిషన్ విచారణ సందర్భంగా గతంలో వ్యాఖ్యానించిన హై కోర్టు.. తాజాగా వారి(కార్మికుల) సమస్యలపై సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు సమాచారం. తెలంగాణలో ప్రయాణికులు రైళ్లలో కంటే బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తారని.. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల తీరుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. కార్మికులు కోరుతున్న 21 డిమాండ్లలో కేవలం 4 డిమాండ్స్ మాత్రమే ప్రభుత్వం తీర్చేలా ఉన్నాయని... ఆ డిమాండ్స్ తీర్చడానికే ఆర్టీసీపై రూ 46.2 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని... కానీ ఆర్టీసీ కార్పొరేషన్ వద్ద కేవలం రూ. 10 కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొందని చెబుతూ.. ప్రభుత్వం రూ. 50 కోట్లు ఇవ్వకుంటే వేము రూ. 50 కోట్లు ఇవ్వాలా అంటూ ఆర్టీసీ వైఖరిని కోర్టు తప్పుబట్టింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండానే కార్మికుల డిమాండ్స్ తీర్చడం సాధ్యం కాదని ప్రభుత్వం ముందుగానే నిర్ణయించుకుందని చెబుతూ ప్రభుత్వ వైఖరిని కోర్టు వేలెత్తిచూపింది. అంతేకాకుండా కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆదేశించింది.
కొన్ని డిమాండ్లను తీర్చడానికి 46 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం.. మొత్తం డిమాండ్లను తీర్చడానికి ఎంత ఖర్చవుతుందనే వివరాలను ఈడిల కమిటీ ఇచ్చిన నివేదికలో ఎందుకు పొందుపర్చలేదని కోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో ఈడీల కమిటీ నివేదికను సైతం తమకు ఎందుకు సమర్పించలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. టూల్స్, స్పేర్ పార్ట్స్ , యూనిఫామ్స్ బడ్జెట్ వివరాలు సైతం ఎందుకు ఇవ్వలేదని కోర్టు నిలదీసింది.