మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది: తెలంగాణ సీఎస్‌పై హైకోర్టు ఆగ్రహం!
డెంగ్యూ మృతుల కుటుంబాలకు ఐఏఎస్‌లే తమ జేబులోంచి రూ.5లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది: తెలంగాణ సీఎస్‌పై హైకోర్టు ఆగ్రహం!
హైదరాబాద్: తెలంగాణలో డెంగ్యూ వ్యాధితో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంపై హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. జనం డెంగ్యూ వ్యాధితో మరణిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డెంగ్యూను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న ఆరోపణల నేపథ్యంలో గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి హై కోర్టుకు వివరణ ఇచ్చుకున్నారు. హై కోర్టుకు వివరణ ఇచ్చుకునే క్రమంలో డెంగ్యూను అరికట్టేందుకు ప్రభుత్వం తరపున తగిన నివారణ చర్యలు తీసుకున్నామని సీఎస్ ఎస్కే జోషి కోర్టుకు తెలిపారు. సీఎస్ ఎస్కే జోషి వివరణపై సంతృప్తి చెందని కోర్టు.. నివారణ చర్యలు తీసుకుంటే డెంగ్యూ కేసులు ఎందుకు పెరుగుతున్నాయ్ ? అని నిలదీసింది. మీరు చెబుతున్న మాటలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయని సీఎస్ ఎస్‌కే జోషిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఈ సందర్భంగా ఎస్‌కే జోషి వివరణను ఖండిస్తూ.. డెంగ్యూ మరణాలపై తమ వద్ద ఆధారాలున్నాయని హైకోర్టు బదులిచ్చింది. ఒకసారి మూసీని సందర్శిస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని ఉన్నతాధికారులకు సూచించింది. అయితే, నగరంలోనే మూసీ నది ప్రవాహం, నాలాల కారణంగా దోమలను నివారించడం కొంత కష్టంగా మారిందన్న ప్రభుత్వం వాదనలనూ హైకోర్టు తీవ్రంగా ఖండించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనూ నదుల మధ్యే నగరాలున్నాయనే విషయాన్ని గ్రహించాలని హైకోర్టు గుర్తు చేసింది. అంతేకాకుండా 30 రోజుల ప్రణాళికలో అధికారులు ఏం ఒరగబెట్టారని హైకోర్టు మండిపడింది. ''ప్రణాళికలన్నీ పేపర్లపైనే ఉన్నాయి.. వాస్తవ రూపం దాల్చలేదు. మూసీ పక్కనున్న హైకోర్టులోనే విపరీతమైన దోమలున్నాయని వ్యాఖ్యానించింది.
డెంగ్యూ కేసులు పెరుగుతుండటంపై గణాంకాలు వెల్లడిస్తూ.. జనవరిలో 85 డెంగ్యూ కేసులు నమోదైతే అక్టోబర్ నాటికి అవి 3,800లకు పెరిగాయి. డెంగ్యూని అరికట్టడంపై ప్రభుత్వం విఫలమైందనడానికి ఇది నిదర్శనం కాదా అని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా ''డెంగ్యూను అరికట్టడంలో ఐఏఎస్‌లు ఎందుకు జోక్యం చేసుకోరు అని ఐఏఎస్ అధికారులను మందలించిన కోర్టు.. ఈ విషయంలో ఐఏఎస్‌లు నిర్లక్ష్యం వహించినట్టయితే, ఐఏఎస్ అధికారులే తమ జేబులోంచి డెంగ్యూ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు మందలించింది. అంతేకాకుండా ఇకపై డెంగ్యూ నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారనే వివరాలను పొందుపరుస్తూ ప్రతీ గురువారం కోర్టుకు నివేదిక ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది. లేదంటే మీడియాలో కథనాలను సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.