ఆర్టీసీ ఎండీపై హై కోర్టు ఆగ్రహం
ఆర్టీసీ ఎండీపై హై కోర్టు ఆగ్రహం
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నేడు హైకోర్టులో జరిగిన విచారణలోనూ అనేక కీలకమైన అంశాలు చర్చకొచ్చాయి. విచారణలో ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీ ఇచ్చిన నివేదికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం.. తప్పుడు లెక్కలతో నివేదిక ఇచ్చారని ఆర్టీసీ యాజమాన్యాన్ని తప్పుపట్టింది. సరైన వివరాలతో యుక్తంగా మరోసారి నివేదిక అందించాలని ఇన్‌చార్జ్ ఎండీని హైకోర్టు ఆదేశించింది. బస్సుల కొనుగోలు కోసం కేటాయించిన రుణాన్ని రాయితీల బకాయిల చెల్లింపుగా నివేదికలో ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. అదే సమయంలో ఆర్టీసీకి జీహెచ్ఎంసీ డబ్బులు చెల్లించాలా? లేదా? అనేది స్పష్టంచేయాలని హైకోర్టు అభిప్రాయపడింది.
2017లో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితే బాగోలేదనే అంశం కోర్టులో ప్రస్తావనకు రాగా.. 2017లో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవచ్చు కానీ ఇప్పుడైతే బాగానే ఉంది కదా అని కోర్టు నిలదీసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆర్టీసీకి రావాల్సిన నిధుల గురించి సంస్థకు చెప్పారా?, ఒకవేళ చెప్పినట్టయితే, ఎప్పుడు చెప్పారంటూ ? జీహెచ్‌ఎంసీ చెల్లించకపోతే మరి ప్రభుత్వానికి లేఖ రాశారా అంటూ ఆర్టీసీ ఎండీపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఉద్దేశ్యపూర్వకంగానే వాస్తవాలు దాచి నివేదికలు ఇచ్చారని తప్పుపట్టిన కోర్టు.. కోర్టుకు ఇలాగేనా నివేదికలు సమర్పించేది అంటూ ఆర్టీసీ ఎండీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. అనంతరం కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.