హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటి, మున్సిపల్ కార్పొరేషన్‌ల ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయాలంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు  దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరిపేందుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం కొట్టివేయడంతో యథావిధిగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి.


మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం తాము ఉత్తర్వులు జారీ చేసేవరకు ఇవ్వొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సోమవారం నాడు హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లు ఖరారు కాకుండా ప్రభుత్వం ఎన్నికల షెడ్యుల్ ప్రకటించడాన్ని తప్పుబడుతూ టీపిసీసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంను హైకోర్టు కొట్టివేసింది.  ఎన్నికల సంఘం 09 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 120 మున్సిపాలిటీలతో పాటు 9 కార్పొరేషన్‌లలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..