ఆర్టీసి సిబ్బంది జీతాల చెల్లింపుపై హై కోర్టు కీలక ఆదేశాలు
ఆర్టీసి సిబ్బంది జీతాల చెల్లింపుపై హై కోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సిబ్బందికి నిలిపేసిన సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుకుంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో 49 వేల 190 మందికి ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెలకుగాను అందాల్సిన జీతం ఇంకా చెల్లించలేదనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో ఆలస్యమైనందున తక్షణమే జీతాలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ నెల ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు జీతాలు రాకపోవడంతో ఆర్టీసి సిబ్బందికి చెందిన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవ్వాల్సి వస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఇదే విషయమై కోర్టు ఆర్టీసి యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. సమ్మె నేపథ్యంలో సిబ్బంది లేకపోవడం వల్లే వారికి జీతాలు ఇవ్వలేకపోయామని కోర్టుకు విన్నవించింది. సోమవారం వరకు కార్మికులకు జీతాలు చెల్లిస్తామని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. సోమవారం లోపు వేతనాలు చెల్లించాలని హైకోర్టు సైతం ఆర్టీసి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.