టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఆ ఇద్దరికీ హై కోర్టులో చుక్కెదురు
టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఆ ఇద్దరికీ హై కోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవ రెడ్డిలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో శాసన మండలి చైర్మన్ అప్పట్లో వారిద్దరిపై అనర్హత వేటు వేశారు. అనంతరం ఆ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇద్దరు నేతలు హైకోర్టును ఆశ్రయిచారు. శాసన మండలి చైర్మన్ చట్ట విరుద్ధంగా తమపై అనర్హత వేటు వేశారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.
నేడు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. యాదవ రెడ్డి, రాములు నాయక్‌ల వాదనను తోసిపుచ్చుతూ వారి పిటిషన్‌ని కొట్టివేసింది. రాములు నాయక్, యాదవ రెడ్డి ఆరోపించినట్టుగా శాసన మండలి ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా లేవని ధర్మాసనం స్పష్టంచేసింది.
ఇదిలావుంటే, ఈ విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించే వరకు ఎన్నికలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ యాదవ రెడ్డి, రాములు నాయక్ చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటిషనర్ల అభ్యర్థనను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని ఈసీ తరఫు న్యాయవాదికి తెలంగాణ హైకోర్టు సూచించింది.