ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం; దరఖాస్తు లేకుండానే రీ వెరిఫికేషన్ !!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇంటర్ బోర్డులో కదలిక వచ్చింది
ఇంటర్ పరీక్షా ఫలితాల విషయంలో జరిగిన అవకతకల సరిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ నష్ట నివారణ చర్యలు చేపడుతోంది. ఫెయిలయిన విద్యార్థులు రీ వెరిఫికేషన్ కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఇంటర్ ప్రకటించింది. జవాబు పత్రాలను ఎలాంటి దరాఖస్తులు లేకుండా పునఃపరిశీలన చేస్తామని తెలిపింది. ఇంటర్ ఫలితాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో కదలిక..
రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించిన వారికి డబ్బులను తిరిగి చెల్లిస్తామని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇంటర్ ఫలితాలపై తీవ్ర దుమారం తలెత్తడంతో స్వయంగా రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఫెయిలయిన 3 లక్షలకు పైగా విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఇంటర్ బోర్డు ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
రెండు వారాల్లో ప్రక్రియ పూర్తి
రీ వెరిఫికేషన్ ప్రక్రియ గడుదు విషయంలోనూ ఆందోళన వ్యక్తం చేస్తుండంతో రెండు వారాల్లోపు బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో 15 రోజుల్లో మెమోలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు ఇప్పటికే సిబ్బంది నియామకం చేపట్టారు. గతంలో మూల్యాంకనం చేసిన అధ్యాపకులతోనే పునఃపరీశీలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.