గతేడాది మాదిరిగానే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావుకి ఈసారి కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుంచి ఆహ్వానం అందింది. 2019 జనవరి 22 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్‌లో జరగనున్న 49వ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు మంత్రి కేటీఆర్‌ని ఆహ్వానించారు. గ్లోబలైజేషన్ 4.0_ షేపింగ్ గ్లోబల్ ఆర్కిటెక్చర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనే అంశంపై ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి సుమారు మూడు వేల మంది పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల్లోని ప్రభుత్వాల ప్రతినిధులు, వాణిజ్య రంగానికి చెందిన మేధావులు ఈ సమావేశాలకి అతిథులుగా హాజరుకానున్నారు.


రాష్ట్రాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు, పారిశ్రామిక సంస్కరణలను ఈ సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అర్బన్ డెవలప్‌మెంట్, డిజిటలైజేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ పాలనలో పారదర్శకత వంటి కీలకమైన అంశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, ఇతర ముఖ్యాంశాలను ఈ సమావేశాల్లో వివరించాల్సిందిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంత్రి కేటీఆర్‌కు పంపిన లేఖలో కోరినట్టు సమాచారం.