పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు ఈ రోజు హైదరాబాద్‌లోని  కంటైన్‌మెంట్ జొన్లలో పర్యటించారు. ఖైరతాబాద్ పరిధిలోని సిఐబి క్వార్టర్స్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి కంటైన్‌మెంట్ జొన్లను సందర్శించిన మంత్రి కే. తారకరామారావు అక్కడి ప్రజలతో మాట్లాడారు.  మరింతగా ప్రజలు వైరస్ బారిన పడకుండా కాపాడేందుకు  ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా  కొన్ని పరిమితులు విధించిందని, అందులో భాగంగానే కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఈ సందర్భంగా పలువురితో ఆయన మాట్లాడారు. ఆయా కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ పట్ల అవగాహన ఉన్నదా..? ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రచురించిన కరపత్రాలు, ఇతర సమాచారం మీకు చేరిందా అని అడిగి తెలుసుకున్నారు.  కరొనా వ్యాప్తి, కంటైన్‌మెంట్ జోన్ల పరిమితులు, నిబంధనల పైన పూర్తిగా అవగాహన ఉన్నవారు తమ పక్క న ఉన్న వారికి మరింత అవగాహన కల్పించి ఇంటికే పరిమితం అయ్యేలా చూడాలని కోరారు. కరోనా లక్షణాలు గనుక కనిపిస్తే స్థానిక అధికారులను సంప్రదించాలని కోరారు.


 లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ బయటకి రాకుండా ఇళ్లకి పరిమితం కావడం ద్వారానే సురక్షితంగా ఉండగలుగుతాం అని కేటీఆర్ తెలిపారు.  లేదంటే కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు.  కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి సారించి, గమనిస్తూ ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. 



ఎలాంటి వైద్య సహకారం కావాలన్నా  ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని కోరారు. కంటైన్‌మెంట్ జోన్లలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలిపారు.  ఇందుకు సంబంధించి ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా..? అని అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు.  ప్రస్తుతం తమకు అవసరమైన సరుకులు అందుతున్నాయని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు బాగున్నాయని పలువురు స్థానికులు మంత్రి కేటీఆర్‌కి తెలిపారు. 


కంటైన్‌మెంట్ జోన్లలో పనిచేస్తున్న పారిశుద్ధ్య , వైద్య సిబ్బందితోనూ మంత్రి కేటీఆర్ మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని ఈ మేరకు కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్న స్థానికులకు కాస్తంత భరోసా ఇచ్చేందుకు తాను స్వయంగా ఇక్కడికి వచ్చానని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రి స్వయంగా పర్యటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం, తమ నిత్య అవసరాల గురించి కనుక్కోవడం ఎంతో భరోసాగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.  త్వరలోనే కరోనా వైరస్ కట్టడి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్... లాక్ డౌన్ నిబంధనలు ఎత్తేసే వరకు అందరూ వాటిని పాటించాలని విజ్ఞప్తి చేశారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..