Telangana MLC Elections 2024: తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం అధికార కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. సామాజిక, ఇతర సమీకరణాల ఆధారంగా నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి రాజీనామాతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే ఈ స్థానాలకు ఒకే ఎన్నిక జరిపితే శాసనసభలో సభ్యుల బలం ఆధారంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు చెరో ఎమ్మెల్సీ స్థానం దక్కి ఉండేవి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం రెండు సీట్లకూ విడివిడిగా.. ఈ నెల 29న ఉప ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం ఒకేసారి ముగియనున్నా.. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ పేర్కొంది. దాంతో రెండు స్థానాలు కాంగ్రెస్‌కే దక్కనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రెండు సీట్ల కోసం దాదాపు  పన్నెండు మంది పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులతో పాటు సీనియర్ నేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన లీడర్లు ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సూర్యాపేట టికెట్ ఆశించిన సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, తుంగతుర్తి టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించిన అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, ప్రోటోకాల్ కమిటి చైర్మన్ హర్కాల వేణుగోపాల్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎర్రావతి అనిల్ కూడా పెద్దల సభ బెర్త్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు.


మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ స్థానం కోసం కొందరు నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ .. ఈ లిస్ట్‌లో ముందున్నారు. బీసీ నేతకు అవకాశం కల్పించాలనుకంటే మహేశ్ గౌడ్ పేరు వినిపిస్తోంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇంత మంది పోటీ పడుతుండటంతో ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్‌లో ఎవరికి దక్కుతాయన్నది హాట్ టాపిక్‌ మారింది.


మరోవైపు గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు సీట్లలో ఒకదానిని మైనార్టీ వర్గానికి కేటాయిద్దామన్న ప్రతిపాదనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారు. సాహిత్య, కళా, సామాజిక రంగాల్లో సేవలందించిన వారిని వీటికి ప్రతిపాదించాల్సి ఉంటుంది. సామాజిక రంగంలో టీజేఎస్‌ అధినేత కోదండరాం పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.. రెండో సీటుకు ప్రజా కవి అందెశ్రీ పేరు వినిపిస్తోంది. ఈయననే ఖరారు చేస్తే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ రెండు సీట్లలో ఒకటి కచ్చితంగా ముస్లింలకు కేటాయించాల్సి వస్తుందంటున్నారు. 


అటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ స్థానం నుంచి తనను బరిలో దింపాలని లేదంటే ఎమ్మెల్సీగానైనా అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని జగ్గారెడ్డి కోరుతున్నట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్‌లో ఓడిన సంపత్‌కుమార్‌ కూడా తనకు ఎమ్మెల్సీ సీటిచ్చి న్యాయం చేయాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. మొత్తమ్మీద ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్యలో కాంగ్రెస్‌లో భారీగానే ఉంది. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందా చూడాలి మరి.


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook