Dharani Portal: తెలంగాణలో సంపూర్ణ భూ వివరాలతో కూడిన పోర్టల్‌ ధరణిలో (Dharani Portal) లోపాలకు ప్రభుత్వం (Telangana Govt) ఎట్టకేలకు చెక్‌ పెట్టింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరణిలో ఓ కొత్త మాడ్యూల్‌ను చేర్చారు. దీంతో, పొరపాట్లు, మార్పులు, చేర్పులకు అవకాశం లభించింది. యాంత్రికంగా దొర్లిన పొరపాట్లను సరిచేసుకునేందుకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వాళ్లకు ఊరట లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధరణి పోర్టల్‌ ప్రారంభించిన సమయంలో పలు పొరపాట్లు దొర్లాయి. ధరణి పోర్టల్‌లో సర్వే నెంబర్లు లేకపోవడం, విస్తీర్ణంలో పొరపాట్లు దొర్లడం, ఆధార్‌ నెంబర్‌ కూడా ఒకదానికొకటి నమోదై ఉండటం వంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని సరిచేసేందుకు మాన్యువల్‌గా అవకాశం లేకుండా పోయింది. దీనిపై ప్రభుత్వానికి వేల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లాయి. అధికారులు కూడా వీటి విషయంలో తలలు పట్టుకున్న పరిస్థితి ఉంది. 


సమస్యల కారణంగా రైతులు (Farmers) చాలాకాలంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. కేబినెట్‌ సబ్‌ కమిటీ.. పలు దఫాలు సమావేశమై ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యలు, రైతులనుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కార మార్గాల గురించి చర్చించింది. చివరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక మేరకు ధరణి పోర్టల్‌లో అదనంగా ఓ మాడ్యూల్‌ను చేర్చారు. 


మంత్రివర్గ ఉపసంఘం నివేదిక (Cabinet Subcommittee Report) ఆధారంగా అప్లికేషన్‌ ఫర్‌ పాస్‌బుక్‌ డేటా కరెక్షన్‌ పేరుతో ధరణి పోర్టల్‌లో కొత్తగా మరో మాడ్యూల్‌ ప్రవేశపెట్టారు. దీంతో బాధిత రైతులకు కాస్త ప్రయోజనం కలిగే అవకాశం లభించింది. పాస్‌ పుస్తకాల్లో పేరు మార్చడం, భూమి స్వభావం తీరును మార్చడం, భూమి వర్గీకరణ, భూమి రకం మార్పు, భూమి విస్తీర్ణాన్ని సరిచేయడం, సర్వే నెంబర్లు మిస్‌ అయితే చేర్చడం, నోషనల్‌ ఖాతాల నుంచి భూమిని బదలాయించడం, భూమి అనుభవంలో మార్పులకు ఈ కొత్త మాడ్యూల్‌లో అవకాశం కల్పించారు. 


తెలంగాణ భూ వివరాలకు (land details) సంబంధించిన ధరణి పోర్టల్‌లో నెలకొన్న ఈ ఎనిమిది రకాల సమస్యలకు ఒకే మాడ్యూల్‌తో పరిష్కారం చూపించింది ప్రభుత్వం. సుదీర్ఘ కాలంగా వెంటాడుతున్న ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరకడంతో ఇటు బాధిత రైతులతో పాటు.. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కూడా రిలీఫ్‌గా ఫీలవుతున్నారు.


Also Read: KTR VERSES KISHAN REDDY : కేటీఆర్ వర్సెస్ కిషన్‌ రెడ్డి.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ట్వీట్ల యుద్ధం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook