Revanth Reddy About KCR and Dharani Portal Scam:  ధరణి పోర్టల్ రాష్ట్రానికి జీవన్మరణ సమస్యగా మారింది అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ధరణి లేకపోతే రైతు బంధు, రైతు బీమా రాదని కేసీఆర్ చెబుతున్నారు. ధరణిని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్, కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. ధరణి దోపిడీపై శోధిస్తున్నా కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు ఇలాంటి దోపిడీకి పాల్పడలేదు అని చెబుతూ.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును అసెంబ్లీ ప్రాంగణంలో చెట్టుకు ఉరేసి చంపినా తప్పు లేదు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గల్ఫ్ దేశాల్లోలా కేటీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపినా తప్పు లేదు. ప్రభుత్వ పనిని ధరణి పేరుతో పూర్తిగా ప్రైవేటు కంపెనీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కు కట్టబెట్టారు. రాష్ట్రంలో భూ లావాదేవీలన్ని ధరణి పోర్టలే నిర్వహిస్తోంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీ గతంలో రూ.90 వేల కోట్లు బ్యాంకులను నిండా ముంచింది. దివాళా తీసిన కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొదటి తప్పు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కు సబ్సిడరీ కంపెనీ టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 52 శాతం వాటాను టెర్రాసిస్ కంపెనీ ఫిలిప్పీన్ కంపీని రూ.12745 కోట్లకు అమ్ముకుంది. 150 కోట్లతో వ్యాపారం చేసే టెర్రాసిస్ కంపెనీ ఫాల్కాన్ కంపెనీకి నవంబర్ 25, 2021 న రూ.1275 కోట్లకు అమ్ముకుంది. కొనుగోలు చేసే కంటే ఒక నెల ముందు మాత్రమే ఫాల్కన్ కంపెనీ ప్రారంభించారు.


ఇప్పుడు టెర్రాసిస్ కంపెనీ 99 శాతం వాటా ఫాల్కన్ కంపీనికి ఇచ్చేసింది. ధరణి పోర్టల్ పూర్తిగా శ్రీధర్ రాజు చేతుల్లోకి వెళ్ళిపోయింది. శ్రీధర్ రాజుకు, కేటీఆర్‌కు ఉన్న సంబంధం ఏమిటని నేను ప్రశ్నించడం లేదు. కేసీఆర్ కు అసలు సిగ్గుందా ? ఒడిశా ప్రభుత్వం 2010లో ఈ-ధరణి పేరుతో ఈ ప్రాజెక్టు లాంచ్ చేసింది. ఈ కంపెనీ నిర్వాకంపై 2017లో కాగ్ నివేదిక ఇచ్చింది. ధరణిని బంగాళాఖాతంలో పడేయాలని కాగ్ చెప్పింది.


కేసీఆర్ తానే అద్భుతాలు చేసి ధరణిని సృష్ఠించినట్టు చెప్పారు. తన దోపీడీని కప్పి పుచ్చుకోవడానికి కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. ధరణిలో ఇప్పటివరకు 25 లక్షల లావాదేవీలు జరిగాయి. ఇందులో రూ.50 వేల కోట్ల లావాదేవీలు జరిగాయని అంచనా.. ఇవన్నీ ప్రభుత్వ ఖాతాలోకి వెళ్లడంలేదు. ఇవన్నీ శ్రీధర్ రాజు కంపెనీ ఖాతాలోకి వెళుతున్నాయి. ఇక్కడే అసలు మతలబు ఉంది.


రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తిరిగి డబ్బులు రావడం లేదు. మక్తల్‌కు చెందిన ఆంజనేయులు గౌడ్ ఒక ఉదాహరణ. ఆన్‌లైన్‌లో మాత్రం డబ్బులు రిఫండ్ కావడం లేదు. ఇలా ఎన్ని వందల కోట్లు కంపెనీ ఖాతాలోకి వెళుతున్నాయి ? అసలు ఆ డబ్బులు ప్రభుత్వానికి చేరుతున్నాయా ? ధరణిలో ఆధార్, పాన్ వివరాల సమాచారం దేశాలు దాటి వెళుతోంది. డేటా ప్రైవసీ ప్రకారం దేశ పౌరుల డేటాను విదేశీయులు యాక్సెస్ చేయడానికి వీల్లేదు.


ధరణి దోపీడీని మేం బయట పెడితే.. కేసీఆర్ కల్లు తాగిన కోతిలా ఎగురుతున్నారు. 50 వేల కోట్లలో 40వేల కోట్లు ప్రభుత్వానికి వెళ్లాయని కొంతమంది అధికారులు చెబుతున్నారు. ఇది వాస్తవమా.. అవాస్తవమా విచారణ చేపట్టాలి. కేసీర్, కేటీఆర్ సైబర్ నేరగాళ్లు. తెలంగాణ ప్రజల సొమ్మును. దోచుకున్నారు. ధరణిలో జరిగిన 25 లక్షల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి. తక్షణమే ధరణి లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం కాగ్ నివేదిక కోరాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. 


సీసీఎల్ఏ కమిషనర్, చీఫ్ సెక్రెటరీ, సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం.... అవసరమైతే కోర్టు తలుపు తడతాం. దోపిడీ బయటపడుతుంది అనే భయంతోనే నా ఆరోపణలపై కేసీఆర్ తీవ్రంగా స్పందిస్తున్నారు. అందుకే కేసీఆర్ రైతులను, ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ధరణి అనేది కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు... అది కేసీఆర్ దోపిడీకి గేట్ వే .. లోపాలు లేకుంటే కోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దోషిగా నిలబడింది ? ధరణి మాస్టర్ కీ శ్రీధర్ రాజు దగ్గర ఉంది. తెలంగాణ భూములన్నీ ఆంధ్రా శ్రీధర్ రాజుకు కట్టబెట్టారు. శ్రీధర్ రాజు ఏ యువరాజుకు దగ్గరి వాడో తేలాలి. చిత్తశుద్ధి ఉంటే దీనిపై విచారణ జరిపించాలి. లక్షల కోట్ల దోపిడీ జరుగుతున్నా కేంద్రం కేసీఆర్‌పై ఎందుకు విచారణకు అదేశించడంలేదు ?
దీని వెనక ఏ గూడుపుఠానీ ఉందో కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలే చెప్పాలి అని రేవంత్ రెడ్డి నిలదీశారు. గణాంకాలతో సహా రేవంత్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలకు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపి నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి.