Komatireddy: అనర్హత వేటు కోసమే సస్పెన్షన్ లేటు? కోమటిరెడ్డి విషయంలో కాంగ్రెస్ పక్కా స్కెచ్?
Komatireddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొన్ని రోజులుగా ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా బుధవారం మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెప్పారు.
Komatireddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొన్ని రోజులుగా ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా బుధవారం మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెప్పారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా ఇదే విషయం చెప్పారు. కోమటిరెడ్డి కూడా మునుగోడు నియోజకవర్గ నేతలతో మూడు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహించారు. దీంతో ఆయన రెండు, మూడు రోజుల్లోనే కాషాయ కండువా కప్పుకుంటారనే చర్చ జరిగింది. ఈనెల 29న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుని బండి సంజయ్, ఈటల రాజేందర్, వివేక్ ఢిల్లీ వెళుతున్నారనే వార్తలు వచ్చాయి.
అదే సమయంలో ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. భువనగిరి ఎంపీ వెంకట్ రెడ్డిని ఆహ్వానించినా జ్వరం సాకుతో ఆయన వెళ్లలేదు. కేసీ వేణుగోపాల్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంపైనే పీసీసీ నేతలు చర్చలు జరిపారు. దీంతో ఏ క్షణమైనా రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వస్తాయని మీడియాలో వార్తలు వచ్చాయి. కాని ఢిల్లీలో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారని అన్నారు. ఆయన విషయం పార్టీ అంతర్గత వ్యవహారమని... అంతా సర్ధుకుంటుందని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని సంజయ్ చెప్పారు కదా అని మీడియా ప్రశ్నించగా.. బండి సంజయ్ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. అంతేకాదు సోనియా గాంధీ ఈడీ విచారణను స్వాగతిస్తూ కోమటిరెడ్డి చేసిన కామెంట్లపై ప్రశ్నించగా సమాధానం దాటవేశారు భట్టివిక్రమార్క.
ఢిల్లీలో భట్టి మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా కోమటిరెడ్డి తమతోనే ఉంటారంటూ భట్టి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వ్యూహంలో భాగమని చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమనే నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ పెద్దలు.. ఆయనను సస్పెండ్ చేసే విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తే ఆయన బీజేపీలో చేరినా ఎమ్యెల్యే పదవికి అనర్హత వేటు పడే అవకాశం ఉండదు. అందుకే తనను సస్పెండ్ చేయాలనే రాజగోపాల్ రెడ్డి పీసీసీ చీఫ్ ను టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడే సస్పెండ్ చేయకుండా ఆయన బీజేపీలో చేరేవరకు వెయిట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు, రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరగానే.. రాజగోపాల్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేయాలని టీపీసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికకు అధికార పార్టీ కూడా సిద్ధంగా ఉండటంతో అనర్హత పిటిషన్ పై స్పీకర్ కూడా వెంటనే నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ లీడర్లు అంచనా వేస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నిక విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ చర్చలు జరిపారని చెబుతున్నారు.మునుగోడులో పార్టీ బలంగా ఉన్నందున ఉపన్నికకు వెళ్లినా ప్రాబ్లమ్ లేదన్న జిల్లా నేతల సూచనతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అనర్హత వేటు పడేలా పీసీసీ పెద్దలు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే పోటీ చేయడానికి సిద్ధమంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ముందుకు వస్తున్నారు. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో పాటు జర్నలిస్ట్ సంఘం నేత పల్లె రవికుమార్ గౌడ్, ఉస్మానియా విద్యార్థి నాయకుడు పున్న కైలాస్ నేత పేర్లు వినిపిస్తున్నాయి. బలమైన అభ్యర్థి కోసం వెతుకుతున్న పీసీసీ పెద్దలు సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పోటీ చేయించాలని నియోజకవర్గ నేతలు కోరుతున్నా.. ఆయన ఆసక్తిగా లేరని చెబుతున్నారు. మొత్తంగా మునుగోడు ఉపఎన్నికకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ.. పక్కా స్కెచ్ ప్రకారమే ముందుకు వెళుతుందని అంటున్నారు.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook