Telangana Police: అమ్మనా బూతులతో రెచ్చిపోతున్న తెలంగాణ పోలీసులు.. కేటీఆర్, నెటిజన్లు ఆగ్రహం
Telangana Police Abuse And Attack Incidents: జర్నలిస్టులతోపాటు ప్రజలపై తెలంగాణ పోలీసులు దాడులకు పాల్పడుతున్న సంఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 24 గంటల్లోపే రెండు దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి.
Telangana Police: సాధారణ ప్రజలపై తెలంగాణ పోలీసులు రెచ్చిపోతున్నారు. దుర్భాషలాడుతూ.. దాడులు చేస్తూ.. అమ్మనా బూతులపై దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పోలీసులు ప్రజలపై విరుచుకుపడిన సంఘటనలు ఒక్క రోజే రెండు చోటుచేసుకున్నాయి. ప్రజలపై పోలీసులు చేస్తున్న దాడికి సంబంధించిన వీడియోలపై నెటిజన్లతోపాటు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: BRS Party MLAs: బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో చీలిక.. కీలక కార్యక్రమానికి సగం మంది డుమ్మా
ఔటర్‌పై
జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డు పక్కన వాహనాలు నిలిపినందుకు భారీ వాహనాల డ్రైవర్లపై దాడికి పాల్పడ్డారు. బూతులు తిడుతూ.. చేయి చేసుకున్న వీడియో కలకలం రేపింది. ఔటర్ రింగ్ రోడ్డుపై గండి మైసమ్మ నుంచి నర్సాపూర్ వెళ్లే మార్గంలో ఓ లారీ డ్రైవర్‌ను బుధవారం ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్సై యాదగిరి ఓ డ్రైవర్‌పై విరుచుకుపడ్డారు. సాంకేతిక సమస్యతో లారీ ఆగిందని చెబుతున్నా వినకుండా నో పార్కింగ్‌లో వాహనం నిలిపారని ఎస్సై యాదగిరి చేయి చేసుకుని బూతులతో రెచ్చిపోయారు.
Also Read: Kavitha Hospitalise: జైల్లో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత ఆస్పత్రికి తరలింపు.. గులాబీ పార్టీలో కలవరం
చిక్కడపల్లిలో..
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వీధి వ్యాపారులపై చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసుల జులుం ప్రదర్శించారు. ఇందిరాపార్క్ వద్ద వీధి వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారులపై గురువారం చిక్కడపల్లి ట్రాఫిక్ ఏసీపీ యర్నా నాయక్ దౌర్జన్యం ప్రదర్శించారు. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారుల గ్యాస్ సిలిండర్‌లను పోలీసులు తీసుకెళ్లారు. వద్దని బతిమిలాడినా వినిపించుకోకుండా వారిపై దాడులకు పాల్పడ్డారు. కుమారీ ఆంటీకి అనుమతిస్తారు.. మాకేంటి ఈ పరిస్థితి అని వీధి వ్యాపారులు ప్రశ్నించారు.
ఎస్సైపై వేటు
లారీ డ్రైవర్‌పై దుర్భాషలాడిన ట్రాఫిక్ ఎస్సై యాదగిరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతోపాటు కేటీఆర్ నిలదీయడంతో వెంటనే తెలంగాణ పోలీస్ శాఖ స్పందించింది. ఎస్సైపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. 'ఈ ఘటన సైబరాబాద్ జీడిమెట్ల ట్రాఫిక్ పరిధిలో జరిగింది. బాధ్యుడైన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం. ఆయనను బదిలీ చేశాం' అని కేటీఆర్ చేసిన ట్వీట్‌కు తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిస్పందించింది.
కేటీఆర్ ఆగ్రహం..
రాష్ట్రంలో మీడియాతోపాటు సాధారణ ప్రజలపై పోలీసులు రెచ్చిపోతున్న సంఘటనలపై బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ ఎస్సై యాదగిరి వీడియోను పంచుకుంటూ తెలంగాణ డీజీపీని కేటీఆర్ ప్రశ్నించారు. 'పోలీసులు వాహనదారుడిపైన దుర్భాషలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వినరాని భాషలో పోలీస్ సిబ్బంది సాధారణ పౌరుడిని దుర్భాషలాడడం అభ్యంతరకరంగా ఉంది. ఇది పోలీస్ శాఖకు, డీజీపీకి ఆమోదయోగ్యమైన భాషనా? పోలీసులు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలి' అని కేటీఆర్ పోలీస్ శాఖకు హితవు పలికారు.
'ఇటీవల పోలీసులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరు అనేకసార్లు మా దృష్టికి వచ్చింది. పదుల సంఖ్యలో సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వస్తున్నా స్పందించరా?' అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలతో నేరుగా తమ విధులను నిర్వర్తించే పోలీస్ సిబ్బందికి ప్రజలతో వ్యవహరించే విషయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని కేటీఆర్ డీజీపీకి సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి