మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమైన టీఎస్ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే సోమవారం చలో బస్ భవన్ ర్యాలీ చేపట్టారు. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది చేపట్టిన బస్‌భవన్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. కార్మికుల పే స్కేలు సవరణ, ఆర్టీసీలో ఖాళీల భర్తీ, సిబ్బంది ఎదుర్కుంటున్న శాశ్వత సమ్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) డిమాండ్ చేసింది. 2017, ఏప్రిల్ నుంచి రావాల్సిన పే స్కేల్‌ను వెంటనే అమలు చేయాలని టీఎంయూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బస్ భవన్ ముట్టడి అనంతరం టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ.. నేడు టీఎంయూ చేపట్టిన ఈ బస్ భవన్ ముట్టడి ఆర్టీసి కార్మికుల ఆగ్రహానికి ఓ ఉదాహరణ మాత్రమేనని అన్నారు. "కార్మిక లోకం కన్నెర్ర చేసిందని చెప్పడానికి ఇది ఓ నిదర్శనం. ఇప్పటి వరకు కార్మికులు శాంతియుతంగానే ఉన్నారు. ఇకనైనా వారి ఆవేదనను పట్టించుకోకపోతే, ప్రగతి భవన్ ముట్టడికైనా వెనుకాడబోం" అని టీఎంయూ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర ఫలాలు ఆర్టీసీ కార్మికులకు అందలేదని అసంతృప్తి వ్యక్తంచేసిన అశ్వద్ధామ రెడ్డి.. ప్రతీ చిన్న విషయానికి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల మీద కేసులు పెడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు.
ఉద్యమకారుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో అదే ఉద్యమకారుల సమావేశానికి అనుమతి ఎందుకు దొరకడం లేదో అర్థం కావడం లేదు. కార్మికులు, ఉద్యోగులకు ఆర్టీసీలో ఎందుకు ఉద్యోగ భద్రత లేదు? అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయకపోతే, మే 21 తర్వాత ఎప్పుడైనా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే అవకాశం ఉందని అశ్వద్ధామ రెడ్డి స్పష్టంచేశారు.