హైదరాబాద్: తెలంగాణ శాసన సభకు శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓట్లు గల్లంతయ్యాయని భారీ సంఖ్యలో ఓటర్లు ఫిర్యాదు చేయడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు. తమ ఓట్లు గల్లంతవడంతో తాము ఓటు వేసే హక్కును కోల్పోయామని చాలా మంది తనకు స్వయంగా ఫోన్ చేశారని గుర్తుచేసుకుంటూ అందుకు ఆయన తన వైపు నుంచి ఓటర్లకు క్షమాపణలు చెప్పారు. మూడేళ్ల క్రితం జరిగిన ఐఆర్ఈఆర్‌లో పొరపాట్లు దొర్లాయని, అప్పట్లో నిబంధనలు పాటించకుండా ఓట్లను తొలగించడంవల్లే ఈ సమస్య ఎదురైందని రజత్ కుమార్ తెలిపారు. 


జాబితాలో ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాలని క్యాంపెయిన్ చేశామని, అందులో భాగంగానే గత రెండు నెలల్లో దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన 25 లక్షల మంది కొత్త ఓటర్లను జాబితాలో చేర్చామని రజత్ కుమార్ వివరణ ఇచ్చారు.