తెలంగాణలోని జైళ్ళ శాఖ ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జైళ్ళను ఇతర రాష్ట్రాలకు అద్దెకు ఇవ్వాలని భావిస్తోంది. ఈ వినూత్న ఆలోచన ద్వారా 25 కోట్ల వార్షిక ఆదాయం పొందాలని భావిస్తుంది. ఆసక్తి ఉన్న ఇతర రాష్ట్రాల పోలీసు శాఖలు తెలంగాణలో జైళ్ళలో తమ ఖైదీలను ఉంచవచ్చు. అయితే అందుకు ఒకొక ఖైదీకి గాను నెలకు 10000 రూపాయలు అద్దెగా చెల్లించాలి.


అయితే మరీ కరడు గట్టిన హంతకులు కాకుండా, సాధారణ నేరస్తులకు మాత్రమే ఈ జైళ్ళలో ఉంచాలని మాత్రం అనుకుంటున్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్న 50 జైళ్ళలో దాదాపు 5848 ఖైదీలు ఉన్నారు. అయితే జైళ్ళ కెపాసిటీ ప్రకారం ఇంకా 1000 మంది ఖైదీలకు చోటు ఉందని, ఆ అవకాశాన్ని ఇతర రాష్ట్రాలు వినియోగించుకోవాలని తెలంగాణ జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ వీకే సింగ్ తెలియజేశారు. తెలంగాణ జైళ్ళలో అద్దెకు ఉండే ఖైదీలకు పలు ఒకేషనల్ విద్యల్లో శిక్షణ ఇచ్చేందుకు కూడా శాఖ ప్రయత్నిస్తుందని సింగ్ ప్రకటించారు.