తెలంగాణలో  ఓటర్ల జాబితా ఖరారైంది. ఈ విషయాన్ని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో దీనిపై సీరియస్ గా దృష్టి సారించిన ఈసీ ఈ ప్రక్రియను పగడ్బంధీగా పూర్తి చేసిందన్నారు. కాగా ఈ ఓటర్ల జాబితా ఆధారంగానే పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. స్లిప్పులపై పోలింగ్ కేంద్రం మ్యాప్ తో పాటు వివరాలు కూడా ఉంటాయన్నారు. ఓటర్ స్లిప్పులు ఈ నెల 23 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు పంపిణీ చేయనున్నాట్లు తెలిపారు.  ఇంటింటికీ వెళ్లి ఈ స్లిప్పులను పంపిణీ చేయాలని సంబంధిత ఉద్యోగులకు ఈసీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మిగిలినపోయిన ఓటర్ స్లిప్పులను ఓటింగ్ రోజు పోలింగ్ కేంద్రం వద్ద పంపిణీ చేయనున్నామని వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పోలింగ్ ఏర్పాట్లు గురించి మీడియాకు వివరించారు. ఈ క్రమంలో ఆయన పోలింగ్ కేంద్రాలు..సిబ్బంది తదితర విషయానలను వివరించారు. 


* తెలంగాణ వ్యాప్తంగా 32,976 పోలింగ్ కేంద్రాలు 
* పోలింగ్ సిబ్బంది కోసం లక్షా 60 వేల 509 మంది సిబ్బంది
* రాష్ట్ర  స్థాయిలో 35 వేల మంది పోలీస్ సిబ్బంది
* ఇతర రాష్ట్రాల నుంచి 18 వేల మంది సిబ్బంది
* పోలింగ్  విధుల్లో  48 వేల మంది పోలీస్ సిబ్బంది
* పోలింగ్ విధుల్లో 279 కంపెనీల కేంద్ర బలగాలు  
* 7 లక్షల 45 వేల 838 మంది కొత్త ఓటర్లు
* 243 మంది ప్రవాస భారతీయులు తమ పేర్లు నమోదు
*  ‘మీ సేవ’కు పంపిన ఐదు లక్షల ఓటర్ గుర్తింపు కార్డులు
*  నెలాఖరు వరకు కొత్త ఓటర్లందరికీ ఓటర్ గుర్తింపు కార్డులు


ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నోటీసులకు ఇచ్చే వివరణల ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 3వేల 500 ఫిర్యాదులు వచ్చాయని.. ఇందులో 2వేల 220 సరైన కేసులుగా గుర్తించామని అన్నారు. అలాగే తనిఖీల్లో రూ.90.72 కోట్ల నగదు, మద్యం, స్వాధీనం చేసుకున్నామని రజత్ కుమార్ మీడియాకు తెలిపారు. బల్క్ గా ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఈ సందర్భంగా ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ హెచ్చరించారు. 


వాస్తవానికి అక్టోబరు 12న ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేసింది. బోగస్ ఓట్లు తొలగించేందుకు, ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎన్నికలసంఘం తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈఆర్వో నెట్ సాఫ్ట్ వేర్ వల్ల కొన్ని ఓట్లు గల్లంతయ్యాయి. ఎన్నికల సంఘం మళ్లీ ఓటర్ల నమోదుకు అవకాశం ఇవ్వటంతో పేర్లు గల్లంతైనవారు తమపేర్లు నమోదు చేయించుకునే అవకాశం దొరికింది. ఈ క్రమంలో ఈ రోజు తుది ఓటర్ల జాబితాను విడదలు చేసింది. దీని ఆధారంగానే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.