Telangana Weather Updates: సోమవారం వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి ౦.9 కి.మీ ఎత్తులో ఉత్తర - దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. వాతావరణంలో ఈ మార్పుల కారణంగా రాబోయే మూడు రోజులు పాటు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాబోయే 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు  42°C నుండి 44 °C వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో హైదరాబాద్ తో పాటు నగరాన్ని ఆనుకుని ఉన్న చుట్టుపక్కల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 38°C నుండి 41°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అనేక చోట్ల మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ కేంద్రాల్లో రైతులు కొనుగోలు కోసం తీసుకొచ్చిన ఒడ్లు వర్షాల పాలయ్యాయి. వర్షపు నీటికి వరి ధాన్యం తడిసిపోవడం చూసి అన్నదాతల అవస్థలు అంతా ఇంతా కాదు. రెండు వారాలుగా ఐకేపీ కేంద్రంలో ఒడ్లు అమ్మకం కోసం తీసుకొచ్చి కాంటా కోసం, లోడింగ్ కోసం పడిగాపులు పడుతున్నామని.. అలాంటి సమయంలో వచ్చిన ఈ అకాల వర్షం తమను రోడ్డున పడేసిందంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 


చాలా గ్రామాల్లో ఐకేపీ కేంద్రాల్లో రోజుకు ఒకటి లేదా మహా అయితే రెండు లారీలు మాత్రమే లోడింగ్ అవుతున్నాయని.. ఫలితంగా తాము తమ వంతు కోసం రోజుల తరబడి ఐకేపీ కేంద్రాల్లోనే రేయింబవళ్లు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని.. ఇంతలోనే ఈ మాయదారి వాన ఇలా తాము పండించిన పంటను వదర నీటి పాలు చేసింది అని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 


అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం వారిని వేధించకుండా ధాన్యం కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని.. ఒడ్లు పట్టడం నుంచి మొదలుపెడితే, మాయిశ్చర్ పేరుతో, తరుగు పేరుతో లోడింగ్ అయ్యే వరకు ఇబ్బందులు పెడుతూనే ఉన్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒకవేళ ఐకేపీ కేంద్రాల్లో మూవ్మెంట్ వేగంగా ఉండి, ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిపితే రైతులకు ఈ పడిగాపులు, కష్టాలు ఉండవు అని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ఇదిలావుంటే, రేపు మంగళవారం దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.