ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ, 11 వినతి పత్రాలు సమర్పణ
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను పీఎం ముందు ప్రస్తావించారు. ఈ సందర్భంగా కొత్త జోనల్ వ్యవస్థ, హైకోర్టు విభజన , కాళేశ్వరానికి ఆర్థిక సాయం, కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, రక్షణ భూముల కేటాయింపు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. దీంతో పాటు విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కోరినట్లు సమాచారం. కాగా ఈ సందర్భంగా పలు సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని ప్రధాని మోడీకి ఇచ్చారు.
వినతి పత్రాల జాబితా:
* హైకోర్టు విభజన పూర్తి చేయాలి
* కొత్త జోన్ల విధానానికి ఆమోదం తెలపాలి
* బిసి రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కావాలి
* కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి
* వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలి
* జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి
* రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలి
* కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలి
* ఐఐఎం కూడా ఏర్పాటు చేయాలి
* ఐటీఐఆర్ ఏర్పాటు చేయాలి
* సచివాలయం నిర్మాణానికి బైసన్‌పోలో గ్రౌండ్ ఇవ్వాలి
ఇదిలా ఉండగా తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులను కలిసి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తక్షణమే వడుదల చేయాలని కేసీఆర్ కోరనున్నారు.