KTR Condemns Shadnagar Incident: దళిత మహిళపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల తీరు సిగ్గు సిగ్గు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా? అంటూ 'ఎక్స్‌' వేదికగా కేటీఆర్‌ మండిపడ్డారు. ఇదేనా  ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?' అని ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?. మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?' అని పోలీసుల తీరును కేటీఆర్‌ నిలదీశారు. 'నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..!' విస్మయం వ్యక్తం చేశారు. ఇంత కర్కశత్వమా.. సిగ్గు సిగ్గు అంటూ ధ్వజమెత్తారు. 'కొడుకు ముందే చిత్ర హింసలా? రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితా?' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
 
అసెంబ్లీలో.. బయట
'ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? మహిళలంటే ఇంత చిన్నచూపా..!' అంటూ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై దాడులను గుర్తు చేశారు. 'ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు. మరోవైపు దాడులు, దాష్టీకాలు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు. ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారు' అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి జరిగిన అంశాన్ని గుర్తు చేశారు.


కాంగ్రెస్ ను క్షమించదు
'ఆడబిడ్డలపై లాఠీఛార్జీలు, దాడులకు తెగబడుతున్నారు. ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. వాళ్లను గౌరవించకపోయినా ఫర్వాలేదు. ఇలా దౌర్జన్యాలు మాత్రం చేయకండి' అంటూ పోలీసులకు కేటీఆర్‌ హితవు పలికారు. షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమని అభివర్ణించారు. ఈ సంఘటనను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత మహిళలకు న్యాయం చేయాలని కోరారు. దళిత.. మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ  క్షమించదని హెచ్చరించారు.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter