వరంగల్ : Holi festival celebrations హోలీ పండగ సంబరాలు వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురిని బలితీసుకున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలోని కాపులకనపర్తి గ్రామంలో సోమవారం హోలీ ఆటలు ముగిసిన అనంతరం నలుగురు బాలురు సమీపంలోని పాయ చెరువులో స్నానం చేయడానికని వెళ్లగా.. అందులో ఇద్దరు ప్రమాదవశాత్తుగా చెరువులోనే మునిగి (Two boys drown in lake) దుర్మరణంపాలయ్యారు. ఈ ఘటనలో మృతిచెందిన వారిని 5వ తరగతి చదువుతున్న దావుడ్ రాకేష్ (8), 10వ తరగతి చదువుతున్న కందకట్ల యశ్వంత్ (16)గా గుర్తించారు. గజ ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలించి మృతదేహాలను వెలికితీశారు. సదరన్ రాకేష్ (11), రాజ్ కుమార్ (11) ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే, వరంగల్ అర్బన్ జిల్లా  ఖిలా వరంగల్ మండలం తిమ్మాపురంలో మరో విషాదం చోటుచేసుకుంది. స్థానిక మైనార్టీ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు హోలీ ఆడిన తరువాత అందరూ కలిసి తిమ్మాపురం గ్రామ శివారులోని జక్కలొద్ది చెరువులో ఈతకు వెళ్లారు. విద్యార్థులు అంతా నీటిలో దిగిన సమయంలో తిరుపతి అనే పదవ తరగతి విద్యార్థికి ఈత రాక నీటిలోనే మునిగి మృతి చెందాడు. తిరుపతి మృతి విషయం తెలుసుకున్న మైనార్టీ స్కూల్ ప్రిన్సిపల్ మామూనూరు పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.


అందరూ హోలీ పండగ సంబరాల్లో మునిగితేలుతుండగా.. వేర్వేరే గ్రామాలకు చెందిన ముగ్గురు బాలురు ఇలా ప్రమాదవశాత్తుగా మృత్యువాత పడటం ఆయా గ్రామల వారిని తీవ్రంగా కలిచివేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..