Blackbuck poaching case | కృష్ణ జింక మాంసం విక్రయిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్
వన్య ప్రాణి కృష్ణ జింకను చంపిని దాని మాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజని కుమార్ తెలిపారు.
హైదరాబాద్: వన్య ప్రాణి కృష్ణ జింకను చంపిని దాని మాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజని కుమార్ తెలిపారు. హుస్సేని ఆలంకి చెందిన అన్వర్ అలీ అనే వ్యక్తి స్థానికంగా దొరికే పక్షులు విక్రయిస్తున్నారు. ఆ తర్వాత జావిద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో అతడితో కలిసి కుందేళ్లను పట్టి అమ్మడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే వీరికి వనపర్తికి చెందిన సిద్ధయ్య అనే వేటగాడు జత కలిశాడు. సిద్ధయ్య సహాయంతో అడవిలో కృష్ణ జింకలను వేటాడి చంపి(Blackbuck poaching case).. వాటి మాంసాన్ని హైదరాబాద్‌కి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. రూ.3,000లకు కేజీ చొప్పున కృష్ణ జింక మాంసం విక్రయిస్తున్నారనే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. పక్కా పథకం ప్రకారం అటవీ శాఖ అధికారులతో కలిసి దాడులు జరిపారు.
ఈ సోదాల్లో 8 నెలల కృష్ణ జింకను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద వారిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.