మహాకూటమిలో చీలికలు.. కాంగ్రెస్ గురించి కోదండరాం కీలక వ్యాఖ్యలు!
మహాకూటమిలో చీలికలు.. స్పందించిన కోదండరాం
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించే లక్ష్యంతో ఒక్కటిగా ఏర్పడిన మహాకూటమిలో ఎన్నికలకు ముందే చీలికలు వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారంపై టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. మహాకూటమి విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని... టీఆర్ఎస్‌ను ఓడించడంతోపాటు తెలంగాణలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా మహాకూటమి ముందుకెళ్తుందని కోదండరాం అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వైఖరిపై కోదండరాం పరోక్షంగా పలు విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. మహాకూటమిలో కొనసాగాలనుకుంటే వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని.. లేనిపక్షంలో కూటమి నిలబడడం కష్టమవుతుందని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం.
కాంగ్రెస్ తీరు గురించి కోదండరాం మరింత మాట్లాడుతూ.. "ఇతర భాగస్వామ్య పక్షాలతో ఎలా వ్యవహరించాలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత కొరవడిందని.. కూటమిలో ఎవరు, ఎలాంటి పాత్ర పోషించాలో తేల్చుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. పరస్పరం ఒకరిపై మరొకరికి విశ్వాసం, గౌరవం కలిగి ఉంటేనే కలిసి ముందుకు వెళ్లగలమని కోదండరాం తేల్చిచెప్పారు. అయితే, ఏదేమైనా కూటమిని ముందుండి నడిపే బాధ్యత మాత్రం కాంగ్రెస్ పార్టీదేనని ఈ సందర్భంగా కోదండరాం స్పష్టంచేశారు.