కేసీఆర్.. నీ భూకంపం ఏది ? : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
స్వప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారు : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
మైనారిటీలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతానని హామీ ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ హామీని గాలికొదిలేశారని ఆరోపించారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాజాగా ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో రేజర్వేషన్లు ఇప్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాలుగేళ్లు పూర్తయినా ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. భూకంపం సృష్టించయినా సరే తాను అనుకున్నది సాధిస్తానని బల్లగుద్ది మరీ చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత ఆ హామీని ఎందుకు నిర్లక్ష్యం చేశారని నిలదీశారు. మైనారిటీలు, గిరిజనులకు రిజర్వేషన్ల అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ అనుకూలంగా ఉన్నారని ఒకానొక సందర్భంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారని, అయినప్పటికీ ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్లడం లేదంటే అందులో ఆయనకు చిత్తశుద్ధి లేదనే అనుకోవాల్సి ఉంటుందని ఉత్తమ్ విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని.. అందుకే పునర్విభజన బిల్లులో ఇచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్ మంజూరు కాకపోయినా.. గిరిజన యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్రానికి రాకపోయినా కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని అన్నారు. కేవలం తన స్వప్రయోజనాల కోసం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.