హైదరాబాద్‌: శాసన సభ సభ్యత్వానికి టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా గెలిపొందిన ఆయన ఆ తర్వాత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు అందజేశారు. అంతకన్నా ముందుగా ఇదే విషయమై అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డితో మాట్లాడారు. 


హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 1999 నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను ఆరవసారి పోటీ చేసిన ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యానని ట్వీట్ చేశారు. ఇంతకాలంపాటు వారు తనపై పెట్టుకున్న నమ్మకం, విశ్వాసానికి కృతజ్ఞతలు చెబుతున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.