ఎట్టకేలకు ఆ 10 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్
ఎట్టకేలకు ఆ 10 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు చేసిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణలో డిసెంబర్ 7న శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బరిలో నిలిచిన పార్టీలన్నీ ఒక్కొక్కటిగా అన్ని స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నం అయ్యాయి. తాజాగా నవంబర్ 14న గజ్వెల్‌లో నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. అదే రోజున మరో పది నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. పార్టీలో ముఖ్యమైన నేతతో చర్చించిన అనంతరం రానున్న ఒకటి, రెండు రోజుల్లో కోదాడ, ముషీరాబాద్ నియోజకవర్గాలకు సైతం టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టంచేశారు.
ఈ జాబితాలో కొత్తగా పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌కి సైతం స్థానం లభించింది. 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన దానం నాగేందర్, 2010లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రా రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఇటీవల జూన్ 23న టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయనకు పార్టీ టికెట్ దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చినప్పటికీ.. ఎట్టకేలకు పార్టీ విడుదల చేసిన 10 మంది అభ్యర్థుల జాబితా ఆయన పేరు ఉండటంతో ఆ ఉత్కంఠకు తెరపడింది.
తాజాగా కేసీఆర్ విడుదల చేసిన 10 మంది అభ్యర్థుల జాబితాలో అవకాశం దక్కించుకున్న నేతల వివరాలిలా ఉన్నాయి..
మల్కాజ్‌గిరి - మైనంపల్లి హన్మంతరావు
ఖైరతాబాద్ - దానం నాగేందర్
మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి
గోషామహల్ - ప్రేమ్ సింగ్ రాథోడ్
చార్మినార్ - మహ్మద్ సలావుద్దీన్ లోడీ
అంబర్ పేట్ - కాలేరు వెంకటేశ్
హుజూర్ నగర్ - శానంపూడి సైదిరెడ్డి
వరంగల్ తూర్పు - నన్నపనేని నరేందర్
వికారాబాద్ - డా. మెతుకు ఆనంద్
చొప్పదండి - సొంకె రవిశంకర్