గద్వాల: తమ ప్రియతమ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ విష్ణు అనే టీఆర్‌ఎస్‌ నేత ఒకరు జోగుళాంబ గుడిలో 1016 టెంకాయలు కొట్టారు. జోగులాంబ గుడిలో మొక్కుకున్న అనంతరం విష్ణు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేత హరీశ్‌ రావును దమ్మున్న నాయకుడిగా అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పటి నీటి పారుదల శాఖ మంత్రిగా హరీశ్‌ రావు ఎంతో కష్టపడ్డారని.. అటువంటి నాయకుడిని  ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం సరైంది కాదని విష్ణు ఆవేదన వ్యక్తంచేశారు. 


ఇదిలావుంటే, టీఆర్ఎస్‌లో హరీష్ రావుకి అన్యాయం జరుగుతోందని.. ముఖ్యమంత్రి కాదగిన అన్ని అర్హతలూ ఆయనకు ఉన్నాయని అప్పుడప్పుడు ఆయన అభిమానులు బాహటంగానే తమ అభిప్రాయాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, హరీష్ రావు మాత్రం తన విషయంలో పార్టీపై వస్తోన్న ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తున్నారు.