Munugode Byelection: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీఫైనల్ కానుంది. దీంతో అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ చండూరులో బహిరంగ సభ కూడా నిర్వహించింది. మునుగోడు ఉప ఎన్నిక కోసమే సీనియర్ నేతలతో స్ట్రాటజీ, ప్రచార కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలో నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర మునుగోడు నియోజకవర్గంలోకి ఎంటరైంది. దాదాపు వారం రోజుల పాటు నియోజకవర్గంలోనే ఆయన తిరగనున్నారు. మునుగోడులో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రప్పిస్తోంది బీజేపీ. ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్, బీజేపీ దూకుడుగా వెళుతుండగా.. అధికార పార్టీలో మాత్రం నిస్తేజం అలుకుముంది. కోమటిరెడ్డి రాజీనామా ప్రకటన చేసినా గులాబీ పార్టీలో మాత్రం హడావుడి కనిపించడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉప ఎన్నిక రానున్న వేళ మునుగోడు టీఆర్ఎస్ లో సైలెంట్ వాతావరణం ఉండటం చర్చగా మారింది. ఇందుకు నియోజకవర్గ ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీరే కారణమంటున్నారు. మునుగోడు టీఆర్ఎస్ లో వర్గ పోరు తీవ్రంగా ఉంది. కూసుకుంట్లను పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. తర్వాత గత నాలుగేళ్లుగా పార్టీ ఇంచార్జ్ గా ఆయన చాలా మంది నేతలను టార్గెట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తనకు నచ్చినవారికి పదవులు ఇచ్చి ఇష్టారాజ్యాంగా వ్యవహరించారని అంటున్నారు. ఇప్పుడు ఆ నేతలంతా కూసుకుంట్లపై తిరుగుబాటు చేస్తున్నారని తెలుస్తోంది. ఉప ఎన్నికలో కూసుకుంట్లకు టికెట్ ఇస్తే సహకరించే ప్రశ్నే లేదని తేల్చి చెబుతున్నారట. మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఐదుగురు జట్పీటీసీలు, ఐదుగురు ఎంపీపీలు, ఇద్దరు మున్సిపల్ చైర్మెన్లు ఉన్నారు. నియోజకవర్గంలోని స్థానిక ప్రజా ప్రతినిధుల్లో 80 శాతానికి పైగా టీఆర్ఎస్ వాళ్లే ఉన్నారు. వాళ్లలో ప్రస్తుతం కూసుకుంట్లకు మద్దతు ఇచ్చేవారు 10 శాతం మంది నేతలు కూడా లేరని తెలుస్తోంది.


తమ అసమ్మతిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారట కూసుకుంట్ల వ్యతిరేక వర్గం నేతలు. మునుగోడు ఉప ఎన్నికల బాధ్యతలను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ కు రావుకు కేసీఆర్ అప్పగించారు. హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉపఎన్నికలకు రవీందర్ రావే ఇంచార్జ్ గా ఉన్నారు. అందుకే మునుగోడు బాధ్యతలు ఆయనకే అప్పగించారు కేసీఆర్. తక్కెళ్లపల్లి రవీందర్ కు తోడుగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఉప ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ ఆదేశాలతో  మునుగోడు నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో ఈ నేతలు చర్చలు జరుపుతున్నారు. అయితే నియోజకవర్గంలోని మెజార్టీ నేతలు కూసుకుంట్లకు టికెట్ ఇస్తే తమ దారి తాము చూసుకుంటామని వాళ్లకు తేల్చి చెప్పారని తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గ నేతల తీరుతో తక్కెళ్లపల్లి రవీందర్ రావు టీమ్ షాకైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని కేటీఆర్, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం.


మునుగోడు నియోజకవర్గంలో వర్గపోరు తీవ్రంగా ఉందని గ్రహించిన కేసీఆర్ ఉప ఎన్నిక విషయంలో టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్న నేతలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. దీంతో మునుగోడులో పార్టీ పరిస్థితులను  చక్కబెట్టడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రంగంలోకి దిగారని చెబుతున్నారు. కొందరు నేతలతో ఆయన మాట్లాడారని అంటున్నారు. ఉప ఎన్నికలో ఎవరూ పోటీ చేస్తారన్నది ఇంకా డిసైడ్ చేయలేదని.. పార్టీ నేతల అభిప్రాయం ప్రకారమే ఎంపిక ఉంటుందని కేటీఆర్ చెప్పారని తెలుస్తోంది. ఎవరూ తొందరపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ హామీ ఇచ్చారని అంటున్నారు.


మరోవైపు మునుగోడు టికెట్ ను టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్లతో పాటు మరో ఐదుగురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి ఉన్నారు. వీళ్లంతా కూసుకుంట్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఎవరికి వారుగానే కార్యక్రమాలు నిర్వహించిన ఈ నేతలు.. ఇప్పుడు ఏకమయ్యారని తెలుస్తోంది. కూసుకుంట్లకు కాకుండా తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామని.. కూసుకుంట్ల ఇస్తే మాత్రం తిరుగుబాటు తప్పదని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. దీంతో టికెట్ రేసులో ఉన్న నేతలతోనూ కేటీఆర్ స్వయంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. తాజాగా పరిణామాలతో మునుగోడు నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒంటరి అయ్యారని తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలోని వర్గపోరును టీఆర్ఎస్ హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి మరీ...


Also Read: Komati Reddy Rajagopal Reddy: పోచారంను కలవనున్న రాజగోపాల్‌రెడ్డి..రాజీనామా లేఖ సమర్పణ..!


Also Read: Samsung Smart TV: బెస్ట్ బ్రాండ్, బెస్ట్ ఫీచర్స్.. 32 అంగుళాల శాంసంగ్ స్మార్ట్ టీవీ సగం కన్నా తక్కువ ధరకే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook