కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వెల్‌లో కాంగ్రెస్ బలం పుంజుకుందా ?
రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ నేతలు
టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు టీ నర్సారెడ్డి, రాములు నాయక్ ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎస్ఆర్‌డీసీ) చైర్మన్‌గా పనిచేసిన టి నర్సారెడ్డి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పైనే పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ హోదాలో టీఎస్ఆర్‌డీసీ చైర్మన్‌గా కొనసాగారు. ఆ తర్వాత నర్సారెడ్డి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్పంచుకుంటున్నారనే కారణంతో శుక్రవారమే పార్టీ అతడిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసింది.
ఇక ఇదే గజ్వెల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కేసీఆర్‌పై పోటీచేసిన వి ప్రతాప్ రెడ్డి సైతం 6 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ప్రస్తుతానికి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వెల్‌లో అతడి వ్యతిరేకశక్తులన్ని ఏకమైనట్టయిందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ఆర్.సీ. కుంతియా టీ నర్సారెడ్డి, రాములు నాయక్ చేరికను స్వాగతిస్తూ.. వీళ్ల చేరిక కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్నివ్వనుందని అన్నారు. టీఆర్ఎస్‌పై వ్యతిరేకత అధికమవుతోందని కుంతియా అభిప్రాయపడ్డారు.
టీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా తమ గత అనుభవాలను మీడియాతో పంచుకున్న టీ నర్సా రెడ్డి, రాములు నాయక్.. అక్కడ పార్టీలో నేతలకు గౌరవం లేదని అన్నారు. ముఖ్యమంత్రి టీఆర్ఎస్ నేతలకే అందుబాటులో ఉండరని టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు.
ఇదిలావుంటే, తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని, ఒక్క గజ్వెల్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు అని టీఆర్ఎస్ ధీమా వ్యక్తంచేస్తోంది.