హైదరాబాద్: పౌరసత్వం కేసులో టీఆర్ఎస్ కు చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పౌరసత్వం రద్దు చేస్తూ హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై ధర్మాసనం తాత్కాలికంగా స్టే విధించింది. దీనిపై పున: సమీక్షించి.. తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి  ఆరువారాల గడువు విధించింది. తన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ చెన్నమనేని తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన తరఫున న్యాయవాది వాదిస్తూ సంబంధిత వ్యక్తి నుంచి దేశానికి ముప్పు ఉందని భావించినప్పుడే పౌరసత్యాన్ని రద్దు చేయాలని రాజ్యాంగంలో ఉందని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు..ఈ మేరకు స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది.


ఎమ్మెల్యే చెన్నమనేనికి జర్మని పౌరసత్వం ఉందని నిర్ధారించిన కేంద్ర హోంశాఖ  ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ గత మంగళవారం  జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. హోంశాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎమ్మెల్యే చిన్నమనేని హైకోర్టును ఆశ్రయించారు. చెన్నమననేని పిటిసన్ ను స్వీకరించి విచారణ చేపట్టిన హైకోర్టు..కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆరువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది