TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పట్టపగలు దొరికిపోయిన దొంగ బీజేపీ అని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపిన వారితో తమకేంటి సంబంధం అంటూ ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తడిబట్టలతో యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేశారు. మరోవైపు సిట్ బృందం చేపట్టిన దర్యాప్తు ఆపాలని వాళ్ళ కార్యదర్శే కోర్టులో కేసు వేశారు. బీజేపి నేతలు తప్పే చేయనప్పుడు ఇలా ద్వంద వైఖరి ఎందుకు అవలంభిస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలంగాణ బీజేపి నేతలపై మండిపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా గత్తర గత్తర అయితున్నరు
టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అయిన పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగ కాంతా రావులను ప్రలోభపెట్టి కొనుగోలు చేయాలని చూసిన వ్యవహారంతో బీజేపీకి ఏ సంబంధం లేకపోతే ఈ కేసు విచారణ ఆపాలని కోరుతూ కోర్టుకు ఎందుకు వెళ్తోందని ప్రశ్నించిన మంత్రి హరీష్ రావు.. బీజేపీ పార్టీ బండారం బయటపడుతుందేమోననే భయంతోనే కోర్టుకు వెళ్తోందని ఎద్దేవా చేశారు. చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పి లెంపలు వేసుకోవడం తప్ప ఇందులో బీజేపి నేతలు చేయడానికి అంటూ ఇంకేమీ లేదని అన్నారు. చేసిన తప్పు బయటపడటంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా గత్తర గత్తర అయితున్నారు. 


గవర్నర్ ఎందుకు స్పందించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు..
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై నిన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎందుకు స్పందించారో అర్థం కావడం లేదని మంత్రి హరీష్ రావు విస్మయం వ్యక్తంచేశారు. రాహుల్ గాంధీపై పోటీ చేసిన వ్యక్తి గురించి మేము మాట్లాడితే... గవర్నర్ ఎందుకు స్పందించారో మాకు అర్థం కాలేదని చెబుతూ.. తుషార్ గురించి గవర్నర్ చెబుతున్నారని, కానీ మేము చెప్పే తుషార్ వేరు.. గవర్నర్ చెప్పే తుషార్ వేరు అని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా రాజ్యాంగ వ్యవస్థలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నవాళ్లు ఇలాంటి వాఖ్యలు చేయటం సరికాదని.. గవర్నర్ హుందాగా ఉంటే బాగుంటుందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. 


తెలంగాణ బీజేపి నేతలకు మంత్రి హరీష్ రావు సవాల్..
తెలంగాణ పోలీసులు సభ్యులుగా ఉన్న సిట్ బృందం జరిపే విచారణపై విశ్వాసం లేనప్పుడు ఇక్కడి ప్రజల ఓట్లు మాత్రం ఎందుకు అడుగుతున్నారని మంత్రి హరీష్ రావు బీజేపి నేతలకు సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సిట్ విచారణలు జరుగుతున్నాయి కదా.. మరి తెలంగాణలో సిట్ విచారణను అడ్డుకునేందుకు బీజేపీ ఎందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఒకవేళ ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేనట్టయితే.. సిట్ బృందం చేపట్టే విచారణకు సహకరించండి అని తెలంగాణ బీజేపి నేతలకు మంత్రి హరీష్ రావు సవాలు విసిరారు.