తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌‌ఎస్) సోమవారం శాసన మండలి సభ్యుడిని సస్పెండ్ చేసింది. ఎమ్మెల్సీ రాములు నాయక్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు పార్టీ తెలిపింది. 'పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం రాములు నాయక్‌ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం' అని తెలంగాణ ప్రధాన కార్యదర్శి పళ్ల రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాములు నాయక్ నారాయణ ఖేడ్ టిక్కెట్‌‌పై ఆశలు పెట్టుకున్నారట. అయితే కేసీఆర్ ఆ టిక్కెట్‌‌ను మరోసారి మాజీ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డికే ఇచ్చారు. దీంతో రాములు పార్టీని వీడనున్నాడని టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి కథనాలు వచ్చాయి. టిక్కెట్‌ను ఇవ్వకపోవడంతో నాయక్ కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సన్నిహితంగా ఉన్నారని పార్టీ వర్గాలు ఆరోపించాయి. కాగా రాములు నాయక్‌ కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.


నాయక్ మాట్లాడుతూ.. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనలేదని, గిరిజనులంటే టీఆర్‌‌ఎస్ ప్రభుత్వానికి చిన్నచూపు అని ఆయన పేర్కొన్నారు.


"నేను ఏ కాంగ్రెస్ నాయకుడితో ఎప్పుడూ సన్నిహితంగా లేను. పార్టీలో రిజర్వేషన్ అంశం గురించి నేను మాట్లాడాను. అందుకే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్‌పై పార్టీతో మాట్లాడను. నాకు ఆత్మగౌరవం ఉంది. నేను గిరిజన వర్గానికి చెందినవాడిని కాబట్టి వారు ఇలా చేస్తున్నారు." అని రాములు నాయక్ పిటిఐకి తెలిపారు.


ఆదివారం ఒక ప్రైవేట్ హోటల్లో నాయక్ కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులను కలుసుకున్నారని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి.


తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని..  ఆ హామీ ఏమైందని ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రశ్నించారు. తన సస్పెన్షన్ అప్రజాస్వామికమని నాయక్ చెప్పారు.