TRS VS BJP: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అన్ని పార్టీలు దూకుడు పెంచడంతో గతంలో ఎప్పుడు లేనంతగా రాజకీయ వేడి కనిపిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ హైకమాండ్.. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తోంది. మాదాపూర్ హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశం కోసం దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతలంతా రానున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల్లోని బీజేపీ కీలక నేతలు హైదరాబాద్ వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా మూడు రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. సికింంద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది తెలంగాణ బీజేపీ. 10 లక్షల మందిని సమీకరించి సత్తా చాటాలని చూస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతీయ కార్యవర్గ సమావేశాలతో తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. బీజేపీకి వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో బీజేపీకి ధీటుగా గులాబీ బ్యానర్లు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి, మెట్రో పిల్లర్లను మొత్తం ప్రభుత్వ పథకాలను సంబంధించి ప్రకటనలతో ముంచేసింది టీఆర్ఎస్ సర్కార్. బీజేపీ సమావేశాల సందర్భంగా మీడియా అటెన్షన్ మొత్తం అటు వైపు వెళ్లకుండా ప్లాన్ చేస్తోంది. బీజేపీ సమావేశాల రోజైన జూలై2నే  రాజకీయ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది గులాబీ పార్టీ. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్న సమయంలో బల ప్రదర్శనకు దిగుతోంది టీఆర్ఎస్.  శనివారం టీఆర్ఎస్ నిర్వహించనున్న కార్యక్రమం ఆసక్తిగా మారింది. అదే సమయంలో  హైదరాబాద్ లో ఏం జరుగుతుంది?  ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.


బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ వస్తున్న రోజునే హైదరాబాద్ వస్తున్నారు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా. సిన్హా టూర్ ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్. హైదరాబాద్ లో యశ్వంత్ సిన్హాకు ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తోంది.నెక్లెస్ రోడ్ లోని  జలవిహార్లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ ఎస్ సభ నిర్వహిస్తోంది. శనివారం ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు వస్తారు సిన్హా. అక్కడ ఆయనకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు స్వాగతం పలుకుతారు. ఎయిర్‌పోర్టు నుంచి రాజ్‌భవన్‌ మీదుగా నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌ వరకు పది వేల బైక్‌లతో ర్యాలీకి టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. యశ్వంత్ సిన్హాకు స్వాగతం, ర్యాలీపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్ చేశారు.  గ్రేటర్‌ పరిధిలోని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బైక్ ర్యాలీని గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆదేశించారు. యశ్వంత్‌ సిన్హాకు స్వాగతం, ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతను మంత్రి తలసానికి అప్పగించారు కేటీఆర్. గ్రేటర్ పరధిలోని అన్ని నియోజకవర్గాలను కార్యకర్తలను తరలించాలని నిర్ణయించారు.


యశ్వంత్ సిన్హాకు మద్దతుగా పది వేల మందితో బైక్ ర్యాలీ తీయాలన్న టీఆర్ఎస్ నిర్ణయం కాక రేపుతోంది. బీజేపీ సమావేశాలకు కౌంటర్ గానే ర్యాలీ నిర్వహిస్తుందనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రపతి అభ్యర్థి ప్రచారం ఎప్పుడైనా సాదాసీదాగా సాగుతుంది.గతంలో రాంనాథ్ కోవిండ్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాని ఈసారి మాత్రం టీఆర్ఎస్ హంగామా చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ముందు బలప్రదర్శన చేసే యోచనతోనే కేటీఆర్ ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు. కావాలనే యశ్వంత్ సిన్హాను బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల రోజునే హైదరాబాద్ రప్పించారనే వాదన వస్తోంది. మొత్తంగా బీజేపీ అగ్రనేతలంతా హైదరాబాద్ లో ఉన్న సమయంలో టీఆర్ఎస్ చేపట్టిన బైక్ ర్యాలీ తెలంగాణలో ఆసక్తిగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనన్న చర్చ సాగుతోంది.


READ ALSO:  హైదరాబాద్ లో మూడు రోజులు ప్రధాని మోడీ టూర్.. ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలుసా..? 


READ ALSO: Hero Vishal: కుప్పంలో చంద్రబాబుపై విశాల్ పోటీ? క్లారిటీ ఇచ్చిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook