తెలంగాణలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ ఎంపీ స్థానాలకు గాను శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార పక్షమైన టీఆర్‌ఎస్ పార్టీ మూడు సీట్లను సొంతం చేసుకుని ఘన విజయం సాధించింది. బరిలో నిలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు జొగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ ముదిరాజ్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ బలరాం నాయక్ ఓటమిపాలయ్యారు. బలరాం నాయక్‌కి 10 ఓట్లు మాత్రమే లభించాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థులు బండ ప్రకాశ్‌కు 33 ఓట్లు, బడుగుల లింగయ్య యాదవ్‌కు 32 ఓట్లు, జోగినపల్లి సంతోష్ కుమార్‌ 32 ఓట్లతో గెలుపొందారు. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 108 ఓట్లు నమోదయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఓటును ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు. మాధవరెడ్డి ఓటు వేసే క్రమంలో ఏజెంట్‌కు చూపించి ఓటు వేశారు. దీంతో మాధవ రెడ్డి వైఖరిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం మాధవ రెడ్డి ఓటును ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు. 


ఇక టీడీపీ టికెట్‌తో గెలిచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సీపీఎం పార్టీ తరపున గెలిచిన సున్నం రాజయ్య ఈ ఎన్నికలకు దూరంగా వున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కే లక్ష్మణ్, కిషన్ రెడ్డి, రాజాసింగ్ లోథ్, రామచంద్రా రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సైతం ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు. పార్టీ అధినాయకత్వం సూచనల మేరకు తాము ఈ ఓటింగ్ లో పాల్గొనడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.