వరంగల్: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కాకతీయ యూనివర్సిటీలోని సెనెట్ హాలులో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి, ఐసెట్ కన్వీనర్, కేయూ వీసీ ఆచార్య ఆర్.సాయన్న ఐసెట్ ఫలితాలను విడుదలచేశారు. ఐసెట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://icet.tsche.ac.in లో లేదా www.manabadi.com వెబ్‌సైట్‌లోనూ చెక్ చేసుకోవచ్చు. మే 23, 24వ తేదీల్లో ఆన్‌లైన్ ద్వారా తెలుగురాష్ట్రాల్లో మొత్తం 58 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 49 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో దాదాపు 97.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది.


160.17 మార్కులతో మల్కాజ్‌గిరికి చెందిన మండవ హనీష్ సత్య మొదటిస్థానంలో నిలవగా.. మేడ్చల్ జిల్లా నాచారంకు చెందిన సూర్య ఉజ్వల్ నూకల రెండో స్థానం సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌కి చెందిన ప్రద్యుమ్న రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. దీంతో తొలి మూడు స్థానాలు హైదరాబాద్ అభ్యర్థులకే దక్కినట్టయింది. నిజామాబాద్ జిల్లాకి చెందిన తిరుమల సాయి 4వ స్థానం, సూర్యపేటకు చెందిన లిక్కి భార్గవి ఐదో స్థానం దక్కించుకున్నారు.