తెలంగాణలో పోలీస్‌ నియామకాలకు  దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ముగిసింది. సబ్ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్ పోస్టులకు 7.19 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ పోలీస్‌ నియామక బోర్డు ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే పరీక్ష తేదీలను ప్రకటిస్తామని అన్నారు. 1,271 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 1.88 లక్షలు, 16,925 కానిస్టేబుల్‌ పోస్టులకు 4.79 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. 29 కమ్యూనికేషన్‌ ఎస్సై పోస్టులకు 13,944 దరఖాస్తులు వచ్చాయన్నారు. 26 ఫింగర్‌ ప్రింట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 14,986 దరఖాస్తులు వచ్చినట్లు  శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ పోలీస్‌ నియామక బోర్డు వివిధ విభాగాల్లో 18,428 కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టుల భ‌ర్తీకి మే 31న  ప్రక‌ట‌న విడుద‌ల‌చేసిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో పోలీస్‌ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారం..


కానిస్టేబుల్  పోస్టులకు ఇంట‌ర్ ఉత్తీర్ణత ఉండాలి. ఎస్టీ అభ్యర్థులు ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణత సాధించి ఇంట‌ర్ రెండేళ్ల ప‌రీక్షల‌కు హాజ‌రైతే స‌రిపోతుంది. జులై 1, 2018 నాటికి 18-22 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సై పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఎస్టీ అభ్యర్థులైతే ఇంట‌ర్ ఉత్తీర్ణత‌తోపాటు క‌నీసం మూడేళ్ల డిగ్రీ కోర్సు చ‌దివితే స‌రిపోతుంది. ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ, కమ్యూనికేష‌న్స్ పోస్టుల‌కు ఈసీఈ/ ఈఈఈ/ సీఎస్‌/ ఐటీ వీటిలో ఎందులోనైనా బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరో పోస్టుల‌కు కంప్యూట‌ర్ సైన్స్ / ఐటీ/ క‌ంప్యూట‌ర్ అప్లికేష‌న్స్ వీటిలో ఎందులోనైనా డిగ్రీ ఉండాలి. జులై 1, 2018 నాటికి 21 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ఫైర్ స‌ర్వీస్‌, డిప్యూటీ జైల‌ర్ పోస్టుల‌కు 30 ఏళ్లలోపువారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.