తెలంగాణ ఎస్ఐ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,217 పోస్టులకుగాను ఈ ఏడాది ఆగస్టు 26న జరిగిన రాత పరీక్షకు 1,77,992 మంది హాజరవగా, అందులో 1,10,635 మంది ఉత్తీర్ణత సాధించినట్టు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు ఆదివారం వెల్లడించారు. ఎస్ఐ పోస్టులకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులు, కటాఫ్ మార్కుల వివరాలను tslprb.in వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చునని తెలిపారు. సగటు మార్కులను 72.8గా నిర్ధారించామని, అత్యధికంగా 151 మార్కులు, అత్యల్పంగా 8 మార్కులు వచ్చాయని వెల్లడించారు. మోడల్‌ మార్కులు-69/200 మార్కులను 4,776 మంది అభ్యర్థులు సాధించారన్నారు.


దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలతో పాటు అర్హత పొందని వారి జాబితాను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. పార్ట్‌–2 దరఖాస్తుల ప్రక్రియ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. అర్హులైన అభ్యర్థులకు నోటిఫికేషన్‌ ప్రకారం ఒక్కసారి మాత్రమే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు తెలిపింది. అయితే వ్యక్తిత్వం, ధ్రువపత్రాలు, దస్త్రాల పరిశీలన, మెడికల్ ఫిట్ నెస్ తర్వాతే తుది ఎంపిక జరుగుతుందని నియామక సంస్థ స్పష్టం చేసింది.