తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం టీఎస్‌ఆర్జేసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని 35 గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం మే 12న ప్రవేశ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు ఈ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశపరీక్ష రాసేందుకు అర్హులు. టీఎస్‌ఆర్జేసీ నిర్వహించనున్న ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 15 తేదీ వరకు గడువు వుంటుందని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ డైరెక్టర్ ఏ సత్యనారాయణరెడ్డి మీడియాకు తెలిపారు. మరిన్ని వివరాల కోసం http://tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావచ్చు.


ఇదిలావుంటే కేజీ టు పీజీ విద్యా విధానం అమలులో భాగంగా నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్‌టికెట్లు తాజాగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 8న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్ణయించిన కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు tgcet.cgg.gov.in వెబ్‌సైట్లో తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్ స్పష్టంచేశారు.