సూర్యాపేట: ఆర్టీసీ సమ్మె(TSRTC strike) విరమిస్తున్నట్లు ప్రకటించిన అశ్వద్ధామ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఓ కార్మికుడు సోమవారం రాత్రి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కార్మికుడిని సూర్యాపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న నేషనల్ మజ్దూర్ యూనియన్(NMU) జిల్లా నాయకుడు రవి నాయక్‌గా గుర్తించారు. అశ్వద్ధామ రెడ్డి ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వానికి తాకట్టు పెట్టి సీఎం కేసీఆర్‌కి అమ్ముడుపోయాడని రవినాయక్ ఆరోపించారు. 50 రోజులపాటు సమ్మె పేరుతో కార్మికులు జీవితాలతో చేలగాటమాడాడని ఆవేదన వ్యక్తంచేసిన రవినాయక్.. ఆ మనస్తాపంతోనే ఆత్మహత్యా యత్నం చేసినట్టు అతడి సహచర కార్మికులు తెలిపారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిపో ఎదుట రవినాయక్ ఆత్మహత్యాయత్నాన్ని అక్కడే ఉన్న తోటి కార్మికులు, పోలీసులు అడ్డుకున్నారు. ఆత్మహత్య సమస్య పరిష్కారానికి మార్గం కాదని, 50,000 మంది సిబ్బంది ఉన్న సంస్థ కోసం నువ్వొక్కడివి ఆత్మహత్య చేసుకుని ఏం సాధిస్తావని కార్మికులు, పోలీసులు అతడికి నచ్చచెప్పారు.