హైదరాబాద్: మేడారం జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సు సేవలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న టిఎస్ఆర్టీసీ.. అదే సమయంలో బస్సు చార్జీలు కూడా పెంచి మేడారం భక్తులకు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు జరగబోయే మేడరం జాతరకు వెళ్లే బస్సుల ఛార్జీలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయం తీసుకుంది. టిఎస్‌ఆర్‌టిసి సమ్మె తర్వాత బస్సు ఛార్జీలను పెరగడం ఇది రెండోసారి. మేడారంకు సుమారు 23 లక్షల మంది భక్తులు సందర్శించనున్నారని అంచనా వేస్తున్న నేపథ్యంలో మేడారంకు సుమారు 4,000 బస్సులు నడపాలని టిఎస్ఆర్టిసి నిర్ణయించింది. ఇందులో వరంగల్ నుండి 2,250, కరీంనగర్ నుండి 600, ఖమ్మం నుండి 400, ఆదిలాబాద్ నుండి 300, నిజామాబాద్ నుండి 250, హైదరాబాద్ నుండి 200 బస్సులు ఉన్నాయి. రద్దీనికి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచే అవకాశం ఉన్నట్టు ఆర్టీసీ అధికార వర్గాలు తెలిపాయి.


మేడారంకు ప్రత్యేక బస్సుల సేవలు అందించేందుకు ఆర్టీసీ 12,000 మంది ఉద్యోగులను ప్రత్యేకంగా రంగంలోకి దించింది. మేడారం బస్ స్టేషన్ వద్ద బస్సుల కదలికను చూడటానికి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. సవరించిన బస్సు ఛార్జీల ప్రకారం హైదరాబాద్ నుంచి మేడారంకు రూ .440 (ఎక్స్‌ప్రెస్ బస్సు), జనగాం నుంచి రూ .280, మహాబూబాబాద్ నుంచి రూ .270, కాళేశ్వరం నుంచి రూ .260, వరంగల్ నుంచి రూ .190 వసూలు చేయనున్నారు. ఇప్పటికే పెరిగిన ఆర్టీసీ చార్జీలు భారంగా మారాయంటే... మళ్లీ అంతకంటే ఎక్కువ చార్జీలు వసూలు చేయడం తమకు మరింత భారంగా అనిపిస్తోందని కొంతమంది భక్తులు వాపోతున్నారు. నలుగురు కుటుంబసభ్యులు ఉన్న కుటుంబం హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు వెళ్లాలంటే.. వేలకు వేలు జేబుకు చిల్లు పెట్టుకోవాల్సి వస్తోందంటున్నారు ఇంకొంత మంది భక్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.