హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 9న మిలియన్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్టు అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన అశ్వత్థామ రెడ్డి.. మిలియన్‌ మార్చ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారని తెలిపారు. అదే సమయంలో మిలియన్‌ మార్చ్‌కు ఉద్యోగ సంఘాల మద్దతు కూడా కోరతామని అన్నారు. 


ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ డెడ్‌లైన్‌ విధించడంపై మరోసారి స్పందించిన అశ్వత్థామ రెడ్డి.. ముఖ్యమంత్రి డెడ్‌లైన్‌కు ఒక్క కార్మికుడు కూడా స్పందించలేదని... స్వయంగా మంత్రుల వాహనాల్లో తీసుకెళ్లి విధుల్లో చేర్పించినప్పటికీ, కార్మికులు తిరిగి వెనక్కి వచ్చి సమ్మెలో పాల్గొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంతో చర్చలకు ఆర్టీసీ జేఏసీ సిద్ధంగా ఉందని.. ఇంకా సమ్మెను జఠిలం చేసి సమస్యను పెద్దది చేయొద్దని ముఖ్యమంత్రిని కోరుతున్నామని అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఆమోదం లేకుండా ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకోలేదని చెబుతూ.. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తమ సమస్యలను విన్నవించుకునేందుకు తమ ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లిందని తెలిపారు.