సీఎం కేసీఆర్ బెదిరించారు, భయపెట్టారు: అశ్వత్థామ రెడ్డి
సమ్మెకు దిగిన తమను ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరించారని, భయపెట్టారని.. అయినా సరే తాము బెదిరేది లేదని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: సమ్మెకు దిగిన తమను ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరించారని, భయపెట్టారని.. అయినా సరే తాము బెదిరేది లేదని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఎన్ని కుయుక్తులు చేసినా అంతిమ విజయం తమదేనని.. చివరకు కార్మికులే విజయం సాధిస్తారని అశ్వత్థామ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సరూర్ నగర్ గ్రౌండ్‌లో జరిగిన సకల జనుల సమర భేరి సభా వేదికపై నుంచి ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మెతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. గమ్యాన్ని చేరేవరకు కార్మికులు ఊరుకోవద్దని వారిలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేశారు. నాడు తెలంగాణ కోసం కులమతాలకు అతీతంగా ఉద్యమాలు చేశారని గుర్తుచేసిన అశ్వత్థామ రెడ్డి.. రామాయణంలో ఉడత రామునికి దారి చూపించకుంటే రామాయణమే లేదని, తాము కూడా ఉడతలాంటి వాళ్లమేనని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమస్పూర్తిని అభినందించిన అశ్వత్థామ రెడ్డి.. కార్మికులకు జీతాలు ఇవ్వకున్నా ఏ ఒక్క కార్మికుడూ వెనక్కి తగ్గలేదని అన్నారు. గెలుపు కోసం చేసే ఈ పోరాటంలో కార్మికులు ధైర్యంగా పోరాడి విజయం సాధించాలని కార్మికులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మె విషయంలో సర్కార్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన అశ్వత్థామ రెడ్డి.. హైకోర్టు ఆదేశాలను కూడా సర్కార్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమ్మె చట్ట వ్యతిరేకం కాదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పలు ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతిస్తున్నాయని.. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తాము సమ్మెను విరమించేది లేదని స్పష్టంచేశారు. సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట 24 గంటల దీక్షలకు దిగుతామని అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు.