హైదరాబాద్: సమ్మెకు దిగిన ఆర్టీసీ యూనియన్‌ నేతలు విపక్షాల వలలో చిక్కుకున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంపై విపక్షాలు కుట్ర చేస్తున్నాయని.. అందుకే సమ్మెలో ఉన్న ఆర్టీసి యూనియన్ల నేతలను రెచ్చగొడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇంకే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు వేతనాలు ఇస్తున్నామని.. ఎప్పుడూ లేని విధంగా కార్మికులకు 44శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని అన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని మంత్రి ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. 


ఈ సందర్భంగా ఆర్టీసి సమ్మెకు మద్దతు ప్రకటించిన బీజేపిపై మంత్రి ఎర్రబెల్లి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తోన్న బీజేపి... బీజేపి పాలిత రాష్ట్రాల్లోని ఆర్టీసిని ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు. ఇకనైనా బీజేపి నేతలు డ్రామాలు ఆపాలని మంత్రి ఎర్రబెల్లి హితవు పలికారు.