తెలంగాణ టీడీపీలో మరో వికెట్ పడింది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉమా మాధవ రెడ్డి , ఆమె కుమారుడు మరియు భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఏ.సందీప్ రెడ్డి డిసెంబరు 14న తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం ప్రగతి భవన్‌‌లో టిఆర్ఎస్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావులను ఇద్దరు నాయకులు కలుసుకున్నారు. డిసెంబరు 14న తెలంగాణ భవన్‌లో వారి మద్దతుదారులతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు  సీఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్‌లో చేరుతారు. 


2018 మార్చిలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాలలో ఒక స్థానం నుండి  ఉమా మాధవ రెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేయాలని కేసీఆర్ ఆసక్తిని చూపిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఆమె విముఖత వ్యక్తం చేసింది. ఆ స్థానంలో కుమారుడు సందీప్ రెడ్డిని పోటీని నిలబెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్థానం నుండి టిఆర్ఎస్  శాసనసభ్యుడు పి. శేఖర్ రెడ్డి భువనగిరికి  ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 


"టిఆర్ఎస్‌లో  మా సేవలను అందించాలని ముఖ్యమంత్రిగారు కోరారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తాం. సీఎంతో కలిసి పనిచేస్తాం. ఆయన అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను అమలుచేస్తూ బంగారు తెలంగాణ సాధన దిశగా కృషిచేస్తున్నారు" అని రెడ్డి చెప్పారు.