తెలంగాణలో మెగా డీఎస్సీ కాంగ్రెస్ పరిపాలనలోకి వస్తే సాధ్యం చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 20 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించి తీరుతామని ఆయన తెలిపారు. అదే విధంగా కార్పొరేట్ కళాశాలలపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ నేతలు కార్పొరేట్ కళాశాలలు, స్కూళ్ళకు ఊతమిస్తూ విద్యను వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కాగా.. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌తో కలిసి కూటమి ఏర్పాటులో భాగస్వామ్యం అవ్వడానికి మొగ్గు చూపిన పలువురు నాయకులు ఇంకా పలు సంశయాలు వీడనాడడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, సంపత్‌కుమార్‌, మధుయాష్కీ మొదలైనవారితో కూడిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశమై సీట్ల పంపిణీకి రంగాన్ని సిద్ధం చేసింది. తొలి జాబితాను కూడా ప్రకటిస్తామని ఇప్పటికే టీడీపీ టీఎస్‌ అధ్యక్షుడు ఎల్ రమణ మీడియాకి తెలిపారు. అలాగే సనత్ నగర్ సీటు విషయంలో కూడా కొంత సందేహాలు నెలకొన్నాయి.  కాంగ్రెస్‌  నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి, దానికి బదులు సికింద్రాబాద్‌ ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారని సమాచారం. 


అలాగే మొత్తం 119 సీట్లలో కాంగ్రెస్‌ 90 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని.. మిగతా సీట్లను కూటమిలో ఇతరులకు పంచనున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే మొన్నటి వరకూ కోదండరామ్ పార్టీతో పాటు సీపీఐ కూడా కూటమి నుండి వైదొలుగుతాయని కొందరు నేతలు ప్రచారం చేశారు. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం లేదు. వారు అదే కూటమిలో కొనసాగుతారని కూడా కొందరు అంటున్నారు. సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి కూడా మాట్లాడుతూ... కూటమిలో సీట్ల సర్దుబాటుపై పలు చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తమకు రెండు సీట్లు ఇస్తామని అంటున్నారని, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని, అదే సమయంలో కూటమి నుంచి బయటకు వెళ్లేది  లేదని అన్నారు.