సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ హనుమంతరావు బీజేపీపై విమర్శల బాణం సంధించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు దేశాన్ని వినాశనం దిశగా తీసుకెళ్తే.. సద్భావన యాత్రతో అప్పటి కాంగ్రెస్ ప్రధాని రాజీవ్‌గాంధీ దేశంలో ఐకమత్యాన్ని పెంపొందించారని తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. తాజ్‌మహల్ విషయాన్ని బీజేపీ నేతలు వివాదాస్పదం చేస్తున్నారన్నారు. ఇదే వైఖరి కొనసాగితే రేపొద్దున్న, ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళు చార్మినార్‌ను వివాదంలోకి లాగినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. వారు రాజీవ్‌గాంధీ చెప్పినట్లుగానే ఐక్యత దిశగా తమ పయనం సాగించాలని ఆయన కోరారు. ఇటీవలే తాజ్ మహల్ కట్టడాన్ని దేశద్రోహులు నిర్మించారంటూ యూపీ బీజేపీ ఎమ్మెల్యే సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ  నేపథ్యంలో వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేశారు.