తెలంగాణలో డిసెంబర్ 7న శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ స్థానాల్లో కొత్తగా ఓటు హక్కు కోసం పేర్లు నమోదు చేసుకున్న 1.52 లక్షలమంది ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొత్త, పాత ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీ కోసం మీ-సేవా కేంద్రాల్లో కొత్త ఓటర్ల జాబితాను అప్‌లోడ్ చేసేందుకు తగిన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నారు. రానున్న నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి, ఆ తర్వాత ఓటర్లకు గుర్తింపుకార్డులను జారీ చేయనున్నారు. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టల్లేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఓటర్లు తమ పేరు, చిరునామా ఆధారంగా ఓటర్ల గుర్తింపుకార్డులు మీ-సేవా కేంద్రాల నుంచి పొందవచ్చని అధికారులు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో రాష్ర్టాలవారీగా ఎన్నికల ప్రధానాధికారి ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా అందుబాటులో ఉండేది. కానీ ఈసారి కొత్తగా కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో ఓటర్ల జాబితాలను దేశమంతా సమీకృతం చేసి ఈఆర్‌వో నెట్(ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)లో జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో దేశంలో నకిలీ ఓటు హక్కులను నివారించి, ఎక్కడైనా ఒకరికైనా ఒకే ఓటు హక్కు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడానికి వీలు కల్పించనుంది. 


ఓటర్లు తమకు ఓటు హక్కు వచ్చింది లేనిది తెలుసుకునేందుకు వీలుగా ఎన్నికలకు ముందే ఓ ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఓటర్ల జాబితాలో పేరు నమోదు కార్యక్రమం నిరంతర ప్రక్రియ కావడంతో నామినేషన్ల గడువు వరకు, అంటే ఈనెల 12 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.