హైదరాబాద్: సచివాలయం, అసెంబ్లీ భవనాలను కూల్చి కొత్తవి నిర్మించాలనే ఆలోచనను కేసీఆర్ ఇకనైనా మానుకోవాలని కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి అన్నారు. ఉపయోగంలో ఉన్న భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, తద్వారా రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. మూఢ నమ్మకాలతో సచివాలయం భవనాలను కూల్చి భవనాలను తరలించే క్రమంలో రికార్డులు మాయమైతే అందుకు ఎవరు బాధ్యులని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేదంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైతే తాము సుప్రీం కోర్టుకైనా వెళ్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 


ఈ సందర్భంగా టీజేఎస్ అధినేత కోదండరాం మాట్లాడుతూ... వినియోగంలో ఉన్న భవనాల కూల్చివేతల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సచివాలయ భవనాల కూల్చివేతను ఆపాలని మాజీ ఎంపీ వివేక్‌, టీడీపీ నేత ఎల్.రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపి నాయకురాలు డికే అరుణ ఈ అంశంపై మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ విద్య, వైద్య రంగాలను గాలికొదిలేసి.. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం అని పట్టుబడుతుండటంలో ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదని అన్నారు.